
పెట్టిన చేయిని మరువకూడదు
ఏం... రాఘవులు బాగున్నావా... సుబ్బయ్యా మీ పిల్లలు బాగున్నారా...
మంత్రి కామినేని శ్రీనివాస్
వరహాపట్నం (కైకలూరు) : ఏం... రాఘవులు బాగున్నావా... సుబ్బయ్యా మీ పిల్లలు బాగున్నారా... అంటూ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తన స్వగ్రామమైన వరహాపట్నం గ్రామస్తులను పేరుపేరునా పలకిరించారు. జన్మభూమి - మా ఊరు కార్యక్రమం మంత్రి సొంత గ్రామం వరహాపట్నంలో శుక్రవారం జరిగింది. మొదటి సారి అధికార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ మా తల్లి రాజేశ్వరమ్మ కష్టమే నన్ను ఈ రోజు మంత్రిని చేసిందని అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చిన్నతనంలో తనను ఎడ్లబండి మీద తీసుకువచ్చిన వారి పేర్లను గుర్తుచేశారు. పెట్టిన చేయిని, చేసిన మంచిని ప్రతి ఒక్కరూ జీవితంలో గుర్తుంచుకోవాలన్నారు. గ్రామంలోని గర్భిణులకు తన చేతుల మీదుగా సీమంతం చేయడం ఆనందంగా ఉందన్నారు.
వరహాపట్నం - కైకలూరు రోడ్డుకు రూ. 12 లక్షలు, మంచినీటి చెరువు గట్లు పెంచడం కోసం రూ. 85లక్షలు, గ్రామంలోని ఇందిరమ్మ గృహాల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక అధికారిని నియమిస్తానని తెలిపారు. పని ఒత్తిడి కారణంగా ఎక్కువగా గ్రామంలో ఉండలేకపోతున్నానన్నారు. ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను మోసం చేసిందని విమర్శించారు. నరేంద్రమోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, జెడ్పీటీసీ సభ్యురాలు బొమ్మనబోయిన విజయలక్ష్మీ, ఎంపీపీ బండి సత్యవతి, గ్రామ సర్పంచ్ పళ్లెం సరవమ్మ, ఎంపీటీసీ ఉప్పలపాటి జయదేవ్‌కుమార్ పాల్గొన్నారు.
ఆటపాకను ఆదర్శగ్రామంలో తీర్చిదిద్దండి
ఆటపాక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మంత్రి కామినేని చెప్పారు. జన్మభూమి సభ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫించన్ల కోసం రూ. 5వేల కోట్లు, డ్వాక్రా సంఘాల కోసం రూ. 7,500 కోట్లును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. అర్హులైన అందరికి ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పారు. ఎంపీ మాగంటి మాట్లాడుతూ ఆటపాక గ్రామానికి తన కుటుంబానికి ఎంతో బంధముందన్నారు. అనేక సంవత్సరాలు ఇదే గ్రామంలో నివసించిన విషయాలను గుర్తు చేసుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ్య, కైకలూరు వైస్ ఎంపీపీ ఎంఏ.రహీం, ఆటపాక సర్పంచ్ కొదమల శ్యామలత, ఎంపీటీసీ సభ్యులు కడలి లక్ష్మీ, తలారి విక్టోరియమ్మ, మండల టీడీపీ అధ్యక్షుడు పెన్మత్స త్రినాథరాజు, జిల్లా చేపల రైతు సంఘ అధ్యక్షులు ముదునూరి సీతారామరాజు, కైకలూరు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ సామర్ల శివకృష్ణ, ఎంపీడీవో బాలాజీ పాల్గొన్నారు.