- జిల్లాలో గిరిజనుల జనాభాపై కొరవడిన స్పష్టత
- జనాభా అధికంగా ఉన్నా తక్కువగా చూపుతున్నార నే ఆరోపణలు
- సంక్షేమ నిధుల కేటాయింపుల్లో కోత
కడప రూరల్ : సాధారణంగా ఎక్కడైనా జనాభా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ లెక్కల ప్రకారమే సంక్షేమ ఫలాలు అందుతుంటాయి. అయితే, జిల్లాలో గిరిజనుల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువగా చూపుతున్నారనే వాదన వినిపిస్తూనే ఉంది.
2011 లెక్కల ప్రకారం...
2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 65 వేల మంది వరకు గిరిజనులు ఉన్నారు. 2011కు వచ్చేసరికి జిల్లా జనాభా మొత్తం 28 లక్షల 84 వేల 524మంది. అందులో గిరిజనుల జనాభా 75 వేల 886 మంది ఉన్నారు. అందులో పురుషులు 38 వేల 571 మంది, మహిళలు 37 వేల 315 మంది ఉన్నట్లు లెక్కలు తెలుపుతున్నాయి. కేవలం కడప నగర పరిధిలోనే పురుషులు 13 వేల 390 మంది, స్త్రీలు 13 వేల 292 మంది కలిపి మొత్తం 26 వేల 672 మంది గిరిజనులు ఉన్నట్లు లెక్కలు తెలుపుతున్నాయ. తాజాగా జిల్లాలో 1.20 లక్షల నుంచి 1.50 లక్షల వరకు గిరిజన జనాభా ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఓ అంచనా ప్రకారం జిల్లాలో 1లక్షా 3వేల 631 మంది గిరిజన జనాభా ఉన్నట్లు తెలుస్తోంది.
సంక్షేమ పథకాలపై ప్రభావం
జిల్లాలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట, రైల్వేకోడూరు, పోరుమామిళ్ల, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు తదితర ప్రాంతాల్లో గిరిజనులు ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలో సుగాలి, ఎరుకల, యానాది వర్గాలకు చెందిన వారు ఈ తెగ కిందికి వస్తారు. అలాగే అక్కడక్కడా చెంచులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సంక్షేమ ఫలాలు జనాభా ప్రాతిపదికన అందుతాయి. జనాభా తక్కువగా ఉంటే అదే పరిమాణంలో బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి. ఆ ప్రభావం ఆయా వర్గాలపై పడనుంది. నిర్దిష్టంగా జనాభా ఉంటే సంక్షేమ ఫలాలు అందరికీ దక్కుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
శాశ్వత కార్యాలయానికి మోక్షం లేదా?
జిల్లాలో గిరిజన సంక్షేమ, కార్పొరేషన్ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు, ముగ్గురు మినహా ఆ శాఖకు సంబంధించిన అధికారులు లేరు. మిగతా సిబ్బంది డిప్యుటేషన్‌పై వచ్చి వెళ్లే వారే. దీంతో శాఖ పరిపాలనపై పట్టు లేకపోవడమో, జవాబు దారితనం లేకపోవడమో జరుగుతోంది. గతంలో ఈ శాఖలోని సిబ్బంది పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అదే శాశ్వత కార్యాలయంతోపాటు ఆ శాఖ సిబ్బందిని నియమిస్తే ఎలాంటి అక్రమాలకు, సమస్యలకు చోటు ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వివరాలు సేకరిస్తున్నాం
జిల్లాలో గిరిజన వర్గాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏయే వృత్తులు చేపడుతున్నారనే వివరాలు సేకరిస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో గిరిజనుల సంఖ్య 75,886 మంది ఉన్నారు. కొందరి అభిప్రాయం మేరకు జనాభా ఇంకా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జనాభా వివరాలను సేకరిస్తున్నాం. ఒకవేళ జనాభా ఎక్కువగా ఉంటే సంక్షేమ ఫలాల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఉంటుంది.
- లలితాబాయి, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి
అయోమయం.. గిరి‘జనం’
Published Mon, Jul 6 2015 3:22 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM
Advertisement
Advertisement