
ఎస్సై వీరాంజనేయులు
- సూసైడ్ లేఖలో పేర్కొన్న ఎస్‌ఐ వీరాంజనేయులు
- టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకటరావు, డీఎస్పీలు వేధించినట్టు వెల్లడి
విశాఖపట్నం(గోపాలపట్నం): ఓ ఎస్‌ఐ చనిపోతూ.. రాసిన లేఖ సంచలనమైంది. శ్రీకాకుళం జిల్లా వంగర పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేసిన వీరాంజనేయులు విశాఖపట్నంలో మంగళవారం రైలు కింద పడి చనిపోయారు. మృతుని వద్ద ఓ లేఖ రైల్వే పోలీసులకు లభ్యమైంది. ఏసీబీ డీఎస్పీ రంగరాజు, టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకటరావు, ఆయన పీఏ నాయుడు వేధింపులు తట్టుకోలేకే చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు లేఖలో ఎస్‌ఐ పేర్కొన్నారు.
‘‘ఆరునెలలుగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాను. తలెత్తుకోలేని పరిస్థితి.. విధి నిర్వహణలో తప్పుచేయలేదు. కానీ అందరూ మోసగాడిలా చూశారు. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నాను. మరణం వద్దకు వెళ్తున్నా..’’ అని ఆయన రాశారు. కాగా వీరాంజనేయులు మృతదేహాన్ని బుధవారం లక్ష్మీనగర్‌కు తీసుకొచ్చారు. కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. అనంతరం అశ్రునయనాలమధ్య అంతిమ వీడ్కోలు సాగింది.
వేధింపుల వల్లే చనిపోయాడు: మృతుని సోదరుని ఆరోపణ
ఎమ్మెల్యే కళావెంకటరావు, డీఎస్పీ రంగరాజు వేధింపుల వల్లే వీరాంజనేయులు చనిపోయాడని మృతుని సోదరుడు గంగరాజు ఆరోపించారు. గత ఎన్నికల్లో కళా వెంకటరావు అనుయాయులు పంచుతున్న మొత్తాన్ని వీరాంజనేయులు ఎన్నికల కమిషన్‌కు అందజేశారని, అప్పటినుంచి కక్ష మొదలైందన్నారు.