
చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన బాధితుడు పెద్ద లింగమయ్య
కర్నూలు, నంద్యాల: టీడీపీ నాయకులు చెప్పిందే జరగాలి.. కాదు..కూడదు.. అంటే పోలీసులపై ఒత్తిడి తెచ్చి అమాయక ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. టీడీపీ నాయకుడు బాలశంకర్‌రెడ్డి మాట వినడం లేదని రహదారి విషయంలో ఓ అమాయికుడిని గత ఐదు నెలలుగా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేయడంతో ఎస్‌ఐ విష్ణునారాయణ తమను చితక బాదాడని బండిఆత్మకూరు మండలం పెద్దదేవళాపురం గ్రామానికి చెందిన పెద్ద లింగమయ్య, ఆయన లింగేశ్వరమ్మ తెలిపారు. ఎస్‌ఐ కొట్టిన దెబ్బలు తాళలేక చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి ఆదివారం వచ్చారు. బాధితుడు పెద్దలింగమయ్య తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
పెద్దదేవళాపురం గ్రామంలో మాధవరం రోడ్డు కొన్ని సంవత్సరాలుగా ఉంది. గ్రామానికి చెందిన బాలశంకర్‌రెడ్డి భార్య ఐదుసంవత్సరాల క్రితం సర్పంచ్‌గా ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన పెద్దలింగమయ్య వీరి మాట వినడం లేదని టీడీపీ నాయకుడు శంకర్‌రెడ్డి.. మాధవరం రోడ్డును లింగమయ్య పొలంలో వెళ్లేలా చేశారు. కొన్నేళ్లుగా ఉన్న రహదారిని తీసి వేసి తన పొలంలో రస్తా ఎలా వేస్తారని ఐదు నెలల నుంచి లింగమయ్య పోరాడుతూ వస్తున్నాడు. ఈ విషయంపై జేసీ ప్రసన్నవెంకటేష్‌ను కలిసి ఫిర్యాదు చేయగా సానుకూలంగా స్పందించారని లింగమయ్య తెలిపారు. అప్పటి నుంచి తన పొలంలో వేసిన రస్తాను తీసివేస్తామని చెప్పిన నాయకు.. ఈ రోజు వరకు తీయలేదన్నారు. ఈ విషయంపై మూడు రోజుల క్రితం బాలశంకర్‌రెడ్డిని అడగగా తన భార్యపై దాడి చేశారన్నారు. ఆదివారం ఉదయం తాము ఇంటి వద్ద ఉండగా ఎస్‌ఐ పిలుస్తున్నారని, స్టేషన్‌కు రావాలని కానిస్టేబుళ్లు వచ్చారన్నారు. ఎందుకు రావాలని అడగగా ఎస్‌ఐ మాట్లాడాలని అంటున్నాడంటూ.. స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు.
తెల్లకాగితంపై సంతకం పెట్టాలంటూఎస్‌ఐ బెదిరింపు...
స్టేషన్‌కు వెళ్లగానే ఎస్‌ఐ.. ‘‘నిన్ను కొడితే ఎవరు అడ్డు వస్తారో... పిలుచుకొని రా.. చూద్దాం’’ అంటూ మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా తనపై లాఠీతో ఎక్కడ పడితే అక్కడ కొట్టాడని లింగమయ్య తెలిపారు. అడ్డువచ్చిన తన భార్య లింగేశ్వరమ్మను ఎస్‌ఐ కొట్టారన్నారు. తెల్లకాగితం తీసుకొని వచ్చి సంతకం పెట్టాలంటూ ఒత్తిడి చేశారన్నారు. సంతకం పెట్టనని చెప్పడంతో తీవ్రంగా కొట్టారన్నారు. ఎస్‌ఐ ఎందుకు కొడుతున్నారో కూడా తన అర్థం కాలేదన్నారు.
ఎమ్మెల్యేతో ఎస్‌ఐకి ఫోన్ చేయించారు..
గ్రామానికి చెందిన బాలశంకర్‌రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డితో ఎస్‌ఐకి ఫోన్ చేయించారని లింగమయ్య చెప్పారు. ఎమ్మెల్యే ఫోన్ చేయడంతోనే ఎస్‌ఐ తనను తీవ్రంగా కొట్టారన్నారు. నాకున్న 90సెంట్ల పొలంలో 20సెంట్లలో రహదారి వేస్తే ఎలా జీవనం ఎలా గడవాలని వాపోయారు. న్యాయం జరిగేంత వరకు పోరాడుతానన్నారు. ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment