
సీఐ శుభకుమార్
మడకశిర రూరల్: మడకశిర.. జిల్లాలోనే అత్యంత క్రైం రేటు తక్కువ ఉన్న ప్రాంతం. అయినప్పటికీ ఇక్కడ పనిచేసే సీఐలకు వేటు పడుతూనే ఉంది. ఏదో ఒక వ్యవహారంలో ఆరోపణలు రావడం వీఆర్‌లకు బదిలీ అవడం పరిపాటిగా మారిపోతోంది. ఇదివరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన ఆరోహణరావు, దేవానంద్‌లు వీఆర్‌కు బదిలీ అయిన విషయం విదితమే. రాయలసీయలో వివిధ సర్కిల్ సీఐలను బదిలీ చేస్తూ అదివారం ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగనే మడకశిర సీఐ శుభకుమార్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు. గత సంవత్సరం ఏప్రిల్ 24న మడకశిర సీఐగా శుభకుమార్ బాధ్యతలు స్వీకరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వినూత్న తరహాలో చర్యలు చేపట్టారు.
అందులో భాగంగా గత ఏడాది అక్టోబర్‌లో ‘మీకో దండం...ఎందుకీ గండం’ అంటూ వాహనచోదకులకు అవగాహన కల్పించి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. హెల్మెట్ లేకుండా, పరిమితికి మించి ప్రయాణించడం వల్ల కలిగే నష్టాలను వివరించి వాహనదారులను చైత్యపరిచారు. అటువంటి సీఐ 17 నెలలకే వీఆర్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో ఓ కేసు విషయంలో సీఐ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. బాధితులు నేరుగా ఎస్పీని కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో శుభకుమార్‌పై బదిలీ వేటు పడినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.