
సీఆర్‌జెడ్ గర్జన
ఆర్కే బీచ్ నుంచి ప్రజాగర్జన వేదిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి మారింది.
ఆర్కే బీచ్ నుంచి ప్రజాగర్జన వేదిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి మారింది. ఇ.ఎ. ఎస్.శర్మ ఫిర్యాదుతో వేదికను మార్చుకోవాల్సి వచ్చింది. అదనపు జాయింట్ కలెక్టర్ సభా ఏర్పాట్లు తక్షణం నిలిపివేయాలని మంగళవారం ఆదేశించారు. పనులు జరగకుండా పోలీసులను నియమించారు.
సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సముద్రతీర ప్రాంతాన్ని చదును చేయిస్తున్నారంటూ కలెక్టర్, ఎన్నికల కమిషన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు శర్మ ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆరోఖ్యరాజ్ పనుల నిలిపివేతకు ఆదే శించారు. వేదిక నిర్మాణ పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న గంటా అనుచరుడు పరుచూరి భాస్కరరావు, టీడీపీ నాయకుడు నల్లూరి భాస్కరరావు, ఎంవీవీఎస్ మూర్తి వ్యక్తిగత కార్యదర్శి ప్రసాద్‌లు ఎవరు అడ్డువచ్చిన గర్జన సభను ఇక్కడే నిర్వహిస్తామంటూ కొద్దిసేపు హంగా మా చేశారు. అనంతరం శాసనసభ్యుడు వెలగపూడి తన అనుచరులతో సభాస్థలికి వచ్చి కొద్దిసేపు హల్‌చల్ చేసి చివరకు వెనుతిరిగారు. ఒకదశలో రాజ్యసభ సభ్యుడు గరికిపాటి మోహనరావు ఎట్టిపరిస్థితుల్లో గర్జన సభను బీచ్‌లోనే నిర్వహిస్తామని హడావుడి చేశారు.
విశ్వప్రియ ఫంక్షన్ హాల్‌కు ఎదురుగా రోడ్డుపై చంద్రబాబు వాహనాన్ని నిలిపి అక్కడ నుంచే ఆయన ప్రసంగించేలా ఆలోచించారు. ఇక్కడ కూడా సభకు అడ్డంకులు ఎదురవుతాయన్న అనుమానాలను సీనియర్ నాయకులు వ్యక్తం చేయడంతో ఎందుకొచ్చిన తలనొప్పి అని వేదికను మున్సిపల్ స్టేడియానికి మార్చుకున్నారు. ఎమ్మెల్సీ నన్నపునేని రాజకుమారి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యనారాయణమూర్తిలు కలెక్టర్‌తో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది.
తొలుత ఏయూ మైదానంలోసభ నిర్వహణకు నిర్ణయించగా కోడ్ కారణంగా అనుమతులు రాకపోవడంతో బీచ్‌రోడ్‌కు మార్చుకున్నారు. సీఆర్‌జెడ్ నిబంధనల ఉల్లంఘన కారణంగా మూడోసారి వేదికను స్టేడియాన్ని మార్చుకోవడాన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.