CRZ
-
చట్టం కొందరికి చుట్టం
చీరాల: చీరాల ప్రాంతంలో సముద్ర తీరం అక్రమార్కులకు అడ్డాగా మారింది. రాజకీయ బలం ఉన్నవారికి ఒక మాదిరిగా తీరాన్నే నమ్ముకుని తరాలుగా జీవిస్తున్న మత్య్సకారులకు మరో మాదిరిగా చట్టాలు మారుతున్నాయి. నచ్చని వారిని గుడిసెలు తొలగించాలంటే అప్పటికప్పుడే అధికారులు చట్టాన్న వల్లెవేస్తారు. అదే రాజకీయ పలుకుబడి ఉన్న వారైతే రిసార్టులు కట్టి విలాసం, విహారం పేరుతో వ్యాపారాలు చేస్తున్నా అడిగే దిక్కే లేదు. ఇందుకు వేదికగా మారింది సీఆర్‌జడ్ నిబంధన. కోస్టల్ రెగ్యుల్ జోన్ (సీఆర్‌జడ్) చట్టం మత్స్యకారులకు మాత్రం చట్టంగా, రాజకీయ పార్టీల అండదండలు ఉన్న వారికి చుట్టంలా మారింది. సముద్ర తీర ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఎలాంటి బహుళ అంతస్తుల భవనాలు, శాశ్వత కట్టడాలు, రిసార్టులు, శ్లాబ్ వేసి ఉన్న కట్టడాలు నిర్మించవద్దని సుప్రిం కోర్టు ఆదేశించినా కాని చీరాల నియోజకవర్గంలో మాత్రం సీఆర్‌జడ్ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. మత్య్సకారులంటే అధికారులకు అలుసు.. ‘తీరం మా హక్కు.. సముద్రం మా జీవనాధారం’ అనే మత్య్సకారుల నినాదాలను పక్కన బెట్టి తీరంలో టీడీపీ నేతల అండతో కొందరు శాశ్వత భవనాలు నిర్మించారు. అయినా అధికారులు వారిని పట్టించుకోవడం లేదు. తీరం ఒడ్డున నివశించే మత్య్సకారుల పూరి గుడిసెలను తొలగించే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు, బహుళ అంతస్తులు నిర్మించుకుని వ్యాపారాలు చేస్తున్న వారి జోళికి మాత్రం వెళ్లడం లేదు. 2004లో సునామీ ఉపద్రవం సంభవించి సముద్ర తీర ప్రాంతాల్లో నివశించే మత్య్సకారులు, ఇతర ప్రజలు అశువులు బాసారు. దీంతో ప్రభుత్వం గతంలో కోస్టల్ రెగ్యులర్ జోన్ (సీఆర్‌జడ్) చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం సముద్ర తీర ప్రాంతాలకు 500 మీటర్ల సమీపంలో ఎలాంటి శాశ్వత కట్టడాలు, భవనాలు నిర్మాణం చేయ కూడదని స్పష్టంగా ఆదేశించింది. ప్రకృతి విపత్తులు, భారీ వర్షాల సమయంలో సముద్రం ఉప్పొంగి నీరు భయటకు వస్తుందని అందుకు ఎలాంటి నష్టాలు జరగకుండా ఉండేందుకు ఈ చట్టం తీసుకువచ్చింది. అకాల వర్షాలు, తుపాన్లు, సునామీ, అల్ప పీడనాలు వంటి పకృతి వైపరీత్యాల కారణంగా సముద్రం ఉగ్రరూపం దాల్చి అల్లకల్లోలంగా మారుతుంది. కానీ చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లోని తీర ప్రాంతాల్లో మాత్రం సీఆర్‌జడ్ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు అధికారులు. రాజకీయ పార్టీల నేతల అడుగులకు మడుగులు ఒత్తుతు చట్టాలను అమలు చేయడం లేదు. చీరాల నియోజకవర్గంలోని వాడరేవు, విజయలక్ష్మీపురం, పచ్చమొగిలి, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం, కఠారిపాలెం, సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి. ఈ తీరప్రాంతంలో రిసార్టుల పేరుతో గదులు నిర్మించి వ్యాపారాలు చేస్తున్న వారిని వదిలేస్తున్న అధికారులు పూరి గుడిసెలు వేసుకున్న గంగపుత్రులపై మాత్రం విరుచుకుపడుతున్నారు. జిల్లాలోని చీరాల వాడరేవు నుంచి సింగరాయకొండ మండలంలో కరేడు వరకు 102 కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉండగా 74 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ తీర ప్రాంతాలన్నింటిలో సీఆర్‌జడ్ చట్టానికి తూట్లు పొడుస్తూనే ఉన్నారు. అధికారుల అండదండలతో టీడీపీ నాయకులే రిసార్టులు, హేచరిలు నిర్మిస్తూనే ఉన్నారు. అనుమతులున్నాయో లేవో విచారిస్తా... సీఆర్‌జడ్ చట్టాన్ని అనుసరించి సముద్ర తీర ప్రాంతాల్లో 500 మీటర్లలోపు భవనాలు, రిసార్టులు నిర్మాణాలు చేయకూడదు. వేటపాలెం మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయో.. లేదో తెలుసుకుంటా. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందించాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు.– మహ్మద్ గౌస్‌బుడే, వేటపాలెం తహశీల్దార్ -
తీరంలో ‘తమ్ముళ్ల’ ఇష్టారాజ్యం
సాక్షి ప్రతినిధి, కాకినాడ :అధికార పార్టీ నేతల్ని... అందునా ప్రజాప్రతినిధుల్ని ప్రసన్నం చేసుకుంటే ఏదీ అసాధ్యం కాదని పదేపదే రుజువవుతోంది. తీర ప్రాంతంలోని రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలే (హేచరీస్) అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. సముద్రం నుంచి 500 మీటర్ల వరకు కోస్టల్ రెగ్యులేటరీ అథారిటీ (సీఆర్‌జెడ్) పరిధిలో ఉంటుంది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు, తవ్వకాలు జరపాలలన్నా సీఆర్‌జెడ్ అధికారుల అనుమతుల పొందాలి. దీంతో పాటు హేచరీస్ ఏర్పాటుకు కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ అనుమతులు తీసుకోవాలి. కానీ కాకినాడ నుంచి అద్దరిపేట వరకు విస్తరించిన సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా హేచరీస్ నిర్మించి ఏటా రూ.కోట్ల వ్యాపారం చేస్తున్నారు. 80 వరకు హేచరీస్ ఏర్పాటు కాగా కేవలం పదింటికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. పోలీసుల ముందరి కాళ్లకు బంధాలు ఈ ప్రాంతంలో హేచరీల దందా ఓ మాఫియాలా సాగుతోంది. తెలుగుతమ్ముళ్లు అక్రమ హేచరీలకు ప్రోత్సాహమిస్తూ ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.ఐదు లక్షలన దండుకుంటున్నారు. ఇటీవల ఇలా రూ.నాలుగు కోట్లకు పైగా వసూలు చేసినట్టు సమాచారం. హేచరీల్లో ఎక్కువ వాటికి అనుమతులు లేవని తెలిసినా అటు మత్స్యశాఖ కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీసులు కానీ పట్టించుకోక పోవడం విశేషం. అధికార పార్టీ వారు తమ ఆగడాలను అడ్డుకునే వారిపై భౌతిక దాడులకు సైతం బరితెగిస్తున్నారు. కాకినాడకు చెందిన ఒక హేచరీపై టీడీపీ కీలక నేత అనుచరులు శుక్రవారం దాడిచేసి రూ.30 లక్షల విలువ చేసే ఆస్తిని ధ్వంసం చేశారు. దీనంతటి వెనుక టీడీపీ పెద్ద నేతలు అండ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో పోలీసులను జోక్యం చేసుకోకూడదని నేతలే చెబుతున్నారని తెలుస్తోంది. ఇక్కడ సాగుతున్న దందాను కొందరు నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. తెలుగు తమ్ముళ్ల దందా.. సముద్ర తీర ప్రాంతంలో వ్యాపారం చేయాలంటే ఒక ప్రముఖ అధికార పార్టీ నేతకు ముడుపులు సమర్పించుకోవాల్సిందే. ఎవరైనా కాదంటే హేచరీస్ పైకి ఉసిగొల్పుతున్నారు. ఇందుకు ఉదాహరణ శుక్రవారం జరిగిన సంఘటన. కాకినాడకు చెందిన మౌళి దానవాయి పేట పంచాయితీ పరిధిలో ప్రియాంక హేచరీని నడుపుతున్నారు. దీనికి అన్ని అనుమతులూ ఉన్నాయి. అయితే ఆయన అధికార పార్టీ దందా నేత అడిగినంతా ఇవ్వనందున కత్తి కట్టారు. దీనికి తోడు ఈ నెల 22న కేంద్ర, రాష్ట్రానికి చెందిన ప్రత్యేక బృందాలు హేచరీల తనిఖీలకు వస్తున్నారు. దీంతో అనుమతులు లేని హేచరీతపై మౌళే ఫిర్యాదు చేశారని ఆరోపిస్తూ ఫోన్ చేసి బెదిరించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినిపించుకోకుండా తుని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి యనమల కృష్ణుడి ప్రోద్బలంతో అధికార పార్టీకి చెందిన కీలక ప్రతినిధి అనుచరులు మౌళి హేచరీపై దాడి చేసి ధ్వంసం చేశారు. ‘కిట్టయ్యతో పెట్టుకుంటే నీ అంతు చూస్తామని ఫోన్లో బెదిరించారని’ మౌళి వాపోయారు. తనకు జరిగిన అన్యాయం పై పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేదన్నారు. పుట్టగొడుగుల్లా హేచరీలు.. గతంలో టైగర్ రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసే హేచరీలు పదుల సంఖ్యలోనే ఉండేవి. రెండేళ్లుగా వనామీ రొయ్యల సాగు లాభదాయకంగా మారడంతో సీడ్‌కు డిమాండ్ ఏర్పడింది. దీంతో వ్యాపారులు ఆ రొయ్య పిల్లల హేచరీస్‌పై దృష్టి సారించారు. నిబంధనలను గాలికి వదిలి హేచరీ నిర్మాణాలు చేపట్టారు. ఈ ఒక్క ఏడాదిలోనే 30కి పైగా కొత్త హేచరీలు వచ్చాయి. హెదరాబాద్, కృష్ణా, విశాఖపట్నం, చెన్నై, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి బడా వ్యాపారులు స్థానికులతో కలసి హేచరీలు నిర్మించారు. వీటిలో చాలా వాటికి పంచాయతీ అనుమతులు తప్ప సీఆర్‌జెడ్, సీఏఏ అనుమతులు లేవు. సముద్ర జలాలు కలుషితం.. తీర ప్రాంతంలో హేచరీల ఏర్పాటు వలన సముద్ర జలాలు కలుషితమవుతున్నాయి. తీరానికి ఆనుకుని హేచరీలు నిర్మించి, పైపులైన్ల ద్వారా ఉప్పునీటిని ఆక్వా కల్చర్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. అలాగే వినియోగించిన వ్యర్థాలతో కూడిన నీటిని సముద్రంలోకి వదులు తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా అధికారుల కంటికి కనిపించడం లేదు. కారణం.. అధికార మదంతో పేట్రేగుతున్న కొందరు టీడీపీ నేతల ధాష్టీకమే. -
సీఆర్‌జెడ్ గర్జన
ఆర్కే బీచ్ నుంచి ప్రజాగర్జన వేదిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి మారింది. ఇ.ఎ. ఎస్.శర్మ ఫిర్యాదుతో వేదికను మార్చుకోవాల్సి వచ్చింది. అదనపు జాయింట్ కలెక్టర్ సభా ఏర్పాట్లు తక్షణం నిలిపివేయాలని మంగళవారం ఆదేశించారు. పనులు జరగకుండా పోలీసులను నియమించారు. సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సముద్రతీర ప్రాంతాన్ని చదును చేయిస్తున్నారంటూ కలెక్టర్, ఎన్నికల కమిషన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు శర్మ ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆరోఖ్యరాజ్ పనుల నిలిపివేతకు ఆదే శించారు. వేదిక నిర్మాణ పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న గంటా అనుచరుడు పరుచూరి భాస్కరరావు, టీడీపీ నాయకుడు నల్లూరి భాస్కరరావు, ఎంవీవీఎస్ మూర్తి వ్యక్తిగత కార్యదర్శి ప్రసాద్‌లు ఎవరు అడ్డువచ్చిన గర్జన సభను ఇక్కడే నిర్వహిస్తామంటూ కొద్దిసేపు హంగా మా చేశారు. అనంతరం శాసనసభ్యుడు వెలగపూడి తన అనుచరులతో సభాస్థలికి వచ్చి కొద్దిసేపు హల్చల్ చేసి చివరకు వెనుతిరిగారు. ఒకదశలో రాజ్యసభ సభ్యుడు గరికిపాటి మోహనరావు ఎట్టిపరిస్థితుల్లో గర్జన సభను బీచ్‌లోనే నిర్వహిస్తామని హడావుడి చేశారు. విశ్వప్రియ ఫంక్షన్ హాల్‌కు ఎదురుగా రోడ్డుపై చంద్రబాబు వాహనాన్ని నిలిపి అక్కడ నుంచే ఆయన ప్రసంగించేలా ఆలోచించారు. ఇక్కడ కూడా సభకు అడ్డంకులు ఎదురవుతాయన్న అనుమానాలను సీనియర్ నాయకులు వ్యక్తం చేయడంతో ఎందుకొచ్చిన తలనొప్పి అని వేదికను మున్సిపల్ స్టేడియానికి మార్చుకున్నారు. ఎమ్మెల్సీ నన్నపునేని రాజకుమారి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యనారాయణమూర్తిలు కలెక్టర్‌తో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. తొలుత ఏయూ మైదానంలోసభ నిర్వహణకు నిర్ణయించగా కోడ్ కారణంగా అనుమతులు రాకపోవడంతో బీచ్‌రోడ్‌కు మార్చుకున్నారు. సీఆర్‌జెడ్ నిబంధనల ఉల్లంఘన కారణంగా మూడోసారి వేదికను స్టేడియాన్ని మార్చుకోవడాన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
అభాగ్య రేఖ
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: జిల్లా తీర ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉంది. సాధారణంగా విస్తారమైన తీర రేఖ ఉన్న ప్రాంతం పరిశ్రమలు, మత్స్య సంపదతో విలసిల్లుతుంటుంది. కానీ శ్రీకాకుళం జిల్లాకు ఉన్న అతి పెద్ద తీర రేఖ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆ భాగ్యం కల్పించకపోగా.. చెట్ల నరికివేత, సీఆర్‌జెడ్ నిబంధనలను అమలు చేయకపోవడం వంటి కారణాలతో జిల్లావాసుల పాలిట అభాగ్య రేఖగా మారుతోంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన జియోసైన్స్ విద్యార్థులు, బోధకులు తమ ఫీల్డ్ వర్క్‌లో భాగంగా ఇటీవల తీరప్రాంతంలో జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీరం పొడవునా నివసిస్తున్న వేలాది మత్స్యకార కుటుంబాల జీవన విధానం కూడా నాశనమయ్యే ప్రమాదముందని వీరి అధ్యయనం వెల్లడిస్తోంది. ఎచ్చెర్ల మండలంలోని డి.మత్స్యలేశం, రాళ్లపేట, కొత్తమత్స్యలేశం తదితర గ్రామాల్లో పరిశీలన జరిపిన బీఆర్‌ఏయూ బృందం సముద్ర తీరంలో విలువైన ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటు సీఆర్‌జెడ్ పరిధిలో చెట్లు నరికివేతకు గురవుతున్నందున తీరం భారీగా కోతకు గురవుతున్న విషయాన్ని గమనించారు. సీఆర్‌జెడ్ అంటే..?! సముద్ర తీరాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం కోస్టల్ రెగ్యులేషన్ జోన్(సీఆర్‌జెడ్)ను అమల్లోకి తెచ్చి అనేక ఆంక్షలు, పరిమితులు విధించింది. అయితే దురదృష్టవశాత్తు సీఆర్‌జెడ్ అన్నది ఉన్న విషయమే జిల్లావాసులకు తెలియదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక దాని అమలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం.. సముద్ర తీరం నుంచి 500 మీటర్ల పరిధిలో చెట్లు పెంచడమే తప్ప.. నరికివేత పూర్తిగా నిషిద్ధం. అలాగే ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అయితే ఆ నిబంధనలు ఎక్కడా అమలు కావడంలేదు. నిర్మాణాలు పెద్దగా లేకపోయినా చెట్ల నరికివేత యథేచ్ఛగా సాగుతోంది. గతంలో తీరప్రాంతాల్లో సరుగుడు తోటలు విస్తారంగా పెంచేవారు. ఇటీవలి కాలంలో సరుగుడుకు డిమాండ్ పెరగడంతో చెట్లను విచక్షణారహితంగా నిరికేసి, అమ్మేసుకుంటున్నారు. వాటి స్థానంలో కొత్తగా వనాలు పెంచేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు. మరోవైపు చెట్ల నరికివేతతో ఖాళీ అయిన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఫలితంగా తీరప్రాంతం ఖాళీ అయిపోతోంది. సముద్రంలో ఆటుపోట్లు పెరిగినప్పుడు ముందుకు చొచ్చుకువచ్చే భీకర అలలను అడ్డుకొనే చెట్లు లేకపోవడంతో అవి విజృంభించి తీరాన్ని కోతకు గురి చేస్తున్నాయి. గతంలో సునామీ వచ్చిన తరువాత ఈ పరిధిలో ఇళ్లు కూడా నిర్మించరాదని ప్రభుత్వం మత్స్య కారులకు సూచించింది. చాలా గ్రామాల్లో సునామీ ఇళ్ల నిర్మాణం జరక్కపోవటంతో మళ్లీ ఈ నిబంధనను మినహాయించారు. సీఆర్‌జెడ్ పరిధిలో సామాజిక వనాల పెంపకం చేపట్టినా.. అవి అక్రమార్కుల బారిన పడుతున్నాయి. విలువైన సంపదకు నష్టం సముద్ర తీరం కోతకు గురైతే దీనిపైనే ఆధారపడిన మత్స్యకార గ్రామాల మనుగడ ప్రమాదంలో పడుతుంది. వేట కష్టమవుతుంది. తుఫాన్లు, సునామీలు సంభవించే సమయంలో సముద్రం తీర గ్రామాలను ముంచేసే ప్రమాదముంది. దీనికితోడు తీరంలో నిక్షిప్తమై ఉన్న విలువైన ఖనిజ సంపదను కూడా కోల్పోవలసి వస్తుంది. సముద్రపు ఇసుక తిన్నెల్లో గార్నైట్, ఇలిమ్నైట్, ప్రొలైట్, తదితర విలువైన ఖనిజాలు ఉంటాయి. కోత కారణంగా ఇవన్నీ సముద్రంలో కలిసిపోతాయి. చెట్ల పెంపకం తప్పని సరి కోత నుంచి తీరాన్ని రక్షించాలంటే చె ట్ల పెంపకం తప్పనిసరి. ఎచ్చెర్ల మండలంలోని డి.మత్స్యలేశం, రాళ్లపేట, కొత్తమత్స్యలేశం తదితర ప్రాంతాలను పరిశీలించాం. వర్సిటీలో 20 ఆర్థిక సూత్రాల ప్రణాళికలో భాగంగా 26 మంది విద్యార్థులతో కలిసి తీరంలో అధ్యయనం చేశాం. సీఆర్‌జెడ్ పరిధిలోని చెట్లు నరికేస్తున్నారు. దీన్ని అరికట్టకపోతే భవిష్యత్తులో ప్రమాదకరంగా పరిణమిస్తుంది. -డాక్టర్ గొర్లె సూర్యనారాయణ, జీయోసైన్సు కోర్సు కోఆర్డినేటర్, బీఆర్‌ఏయూ పరిశీలిస్తాం మొత్తం తీర ప్రాంతం పరిశీలించాల్సి ఉంది. సీఆర్‌జెడ్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూస్తాం. నిబంధనలకు వ్యతి రేకంగా చెట్లు నరికే వారిపై చర్యలు తీసుకుంటాం. ఎక్కడ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయో ముందుగా గుర్తించాల్సి ఉంది. -పి.కోటేశ్వరరావు, జేడీ, జిల్లా మత్స్యశాఖ