సాక్షి, చేవెళ్ల: కేసీఆర్ పాలనలో దళితులు, గిరిజనులు మోసపోయారని, అందుకే.. ఆదుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటిస్తోంది అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో శనివారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జనలో రేవంత్ రెడ్డి దళిత డిక్లరేషన్‌పై ప్రకటన చేశారు.
ప్రజాగర్జన సభలో దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సభకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సైతం హాజరయ్యారు. అనంతరం డిక్లరేషన్‌కు సంబంధించిన పోస్టర్లను వేదిక మీద ఉన్న నేతలంతా ప్రదర్శించారు.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో కీలకాంశాలు
► ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల స్థలాలు.
►పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ. 6 లక్షలు సాయం
►పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం
►ఎస్సీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు
►ప్రతి కార్పొరేషన్ ద్వారా రూ.750 కోట్లు మంజూరు
►మండలంలో ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు
► దళిత గిరిజన విద్యార్థులకు పది పాస్ అయితే రూ. 10 వేలు.
► డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ. 25 వేలు.
► పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు లక్ష రూపాయలు అందజేత.
► అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షలు
అధికారంలోకి వస్తే.. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం పెంచేలా నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘‘ఎస్సీ వర్గీకరణ చేసి న్యాయం చేస్తాం. అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. కాంట్రాక్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు వాటాల ద్వారా న్యాయం చేస్తాం’’ వెల్లడించారాయన.
రేపు అమిత్ షా వస్తారు..
వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సేనని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల ప్రజా గర్జన వేదిక నుంచి ప్రసంగించిన ఖర్గే..
► తెలంగాణ ఉద్యమం గుర్తు చేసుకుంటే దుఖం వస్తుంది. ఉద్యమంలో అనేక మంది భాగస్వామ్యం అయ్యారు. కానీ, తెలంగాణ వల్ల ఒకే కుటుంబం లాభపడింది(కల్వకుంట్ల కుటుంబాన్ని ఉద్దేశించి..). తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్‌కు ఎక్కడిది?. ఇది తెలంగాణ ప్రజల పోరాటం. కేసీఆర్‌కు బలం ఇచ్చింది మేం. కానీ, మాకు మద్దతు ఇవ్వాల్సిన కేసీఆర్ ఇవ్వలేదు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా నివాసానికి వచ్చి ధన్యవాదాలు తెలిపారు. కానీ, తెలంగాణ క్రెడిట్ అంతా నాదే అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.
► ప్రజల అభీష్టం.. సొనియా గాంధీ చొరవతో తెలంగాణ ఏర్పడింది. ఇక్కడున్నవాళ్లంతా తెలంగాణ కోసం కొట్టాడినవాళ్లే. కేసీఆర్‌ను గద్దెదించడానికే మీరంతా వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 12 సూత్రాలను అమలు చేస్తాం. కన్యాకుమారీ నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్‌జోడో యాత్ర చేశారు. అదీ కాంగ్రెస్ పార్టీ శక్తి. సీడబ్ల్యూసీ సభ్యులు మరింత పెరుగుతారు. వారిలో తెలంగాణ వారికి అవకాశాలు ఉంటాయి. గతంలో సీడబ్ల్యూసీ లో ఉమ్మడి రాష్ట్రం నుండి ఒక్కరే ఉండేవారు. నేను వచ్చాక ఆరుగురికి ఛాన్స్ ఇచ్చాను. సీడబ్ల్యూసీ లో 66 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారు.
► రేపు అమిత్ షా ఖమ్మం వస్తున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని అంటారు. హైదరాబాద్ సంస్థానానికి స్వేచ్ఛ కల్పించింది కాంగ్రెస్. ఐఐటీ, ఎయిమ్స్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఐఐటీ, ఎయిమ్స్ ఏర్పాటు చేసిందెవరు? కాంగ్రెస్ హయాంలో నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. దేశంలో పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించింది ఎవరు?. ఉమ్మడి ఏపిలో కట్టిన ప్రాజెక్టులన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీనే. మా పార్టీ నేతలు పటేల్, నెహ్రూ కలిసి హైదరాబాద్ సంస్థానం ఇండియాలో కలిపారు. కాంగ్రెస్ అభివృద్ధి చేసిన సమయంలో అసలు కేసీఆర్ పార్టీ ఉందా? అని ప్రశ్నించారు ఖర్గే.
► బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. అందుకే నేరుగా బీఆర్‌ఎస్‌ను విమర్శించరు. తెలంగాణలో అధికారంలోకి రాగానే.. ప్రభుత్వం లాక్కున్న ఎస్సీ ఎస్టీల భూములను తిరిగి వాళ్ళకే ఇస్తాం. 26 పార్టీలు బీజేపీని గద్దె దించేందుకు సిద్ధమైతే కేసీఆర్ మాత్రం సైలెంట్ ఉన్నారు. కేసీఆర్ తనది సెక్యులర్ పార్టీ అంటాడు. బీజేపీకి మద్దతు ఇస్తాడు. మా 26 పార్టీల లక్ష్యం బీజేపీని గద్దె దించడంతో పాటు బీజేపీకి మద్దతిచ్చే బీఆర్ఎస్ ని సైతం గద్దె దించుతాం.
► కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చి.. అమలు చేస్తున్నాం. తెలంగాణలోనూ అదే చేస్తాం. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుంది. ఇచ్చిన వాగ్దానాలు అమలు పరిచి తీరుతుంది అని ఖర్గే తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ని ఓడగొట్టండి. దేశంలో మోదీని ఓడగొట్టండి అని ఖర్గే చేవెళ్ల వేదికగా ప్రజలకు పిలుపు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment