నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: ఆస్తి కోసం తోడబుట్టిన చెల్లి కుటుంబాన్నే కడతేర్చేందుకు ప్రయత్నించిన ఓ అక్క ఉదంతమింది. చెల్లెలు కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న ఇంట్లో కిరోసిన్ పోసి నిప్పంటించడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడగా మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున నెల్లూరులోని ఎన్టీఆర్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..గూడూరులోని గాంధీనగర్‌కు చెందిన బుజ్జమ్మ, పోలయ్య దంపతులకు పద్మమ్మ, రమణమ్మ, ఆదిలక్ష్మమ్మ, మురళి, వరలక్ష్మి పిల్లలు. వీరిలో వరలక్ష్మి మృతి చెందింది.
ఎన్టీఆర్ నగర్‌లో ఉన్న బుజ్జమ్మ నివాసంలో కొన్నేళ్లుగా చిన్నకుమార్తె ఆదిలక్ష్మమ్మ తన భర్త అమృతనారాయణ, పిల్లలు సాయిరామ్, సుప్రజతో కలిసి ఉంటోంది. నారాయణ పెయిం టర్‌గా, ఆదిలక్ష్మమ్మ విజయమహల్ గేటు సమీపంలోని ఓ బార్ వద్ద అరటికాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏసీనగర్‌లోని మున్సిపల్ పాఠశాలలో సాయిరామ్ తొమ్మిదో తరగతి, సుప్రజ ఏడో తరగతి చదువుతున్నారు. ఆదిలక్ష్మమ్మ అక్క రమణమ్మ ఏడేళ్ల కిందట భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రులు, బంధువుల వద్ద ఉంటూ వస్తోంది.
ఈ క్రమంలో రెండు నెలల కిందట ఆదిలక్ష్మమ్మ ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ తల్లికి చెందిన ఇల్లు ఖాళీ చేయమంటూ చెల్లెలుపై ఒత్తిడి తెచ్చింది. రమణమ్మకు తల్లి బుజ్జమ్మ నచ్చజెప్పినా ఫలితం కరువైంది. ఇంటి వెనకవైపున్న స్థలంలో ఇల్లు కట్టుకున్న అనంతరం ఖాళీ చేస్తానని ఆదిలక్ష్మమ్మ చెప్పినా రమణమ్మ ఒప్పుకోలేదు. ఈవిషయమై అక్కాచెల్లెలు మధ్య సోమవారం వివాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తురాలైన రమణమ్మ చెల్లెలు ఆదిలక్ష్మమ్మ కుటుంబాన్ని కడతేర్చి ఆస్తి సొంతం చేసుకోవాలని భావించింది. అందులో భాగంగా ఐదు లీటర్ల కిరోసిన్‌ను సిద్ధం చేసుకుంది. ఎప్పటిలాగే సోమవారం రాత్రి అందరూ కలిసి ఇంట్లో నిద్రించగా, మంగళవారం తెల్లవారుజామున రమణమ్మ కిరోసిన్‌ను ఇంట్లో పోసి నిప్పంటించింది.
ఒక్కసారిగా మంటలు ఎగిసిపడిన వెంటనే రమణమ్మ తలుపునకు బయట గడియ పెట్టుకుని వెళ్లిపోయింది. మంటల తీవ్రతకు ఇంట్లోని ఆదిలక్ష్మమ్మ కుటుంబసభ్యులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టి 108లో నారాయణ ఆస్పత్రికి తరలించారు. ఆదిలక్ష్మమ్మ, సుప్రజ, సాయిరామ్‌కు తీవ్రగాయాలు కాగా నారాయణకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఆదిలక్ష్మమ్మ, సాయిరామ్‌ల పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న బాలాజీనగర్ సీఐ మంగారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. రమణమ్మపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఆస్తి కోసం ఘాతుకం
Published Wed, Dec 11 2013 3:26 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement