నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్
ఒంగోలు: కందుకూరు పట్టణంలో ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీన చదలవాడ కొండయ్యపై జరిగిన హత్యాయత్నం కేసుకు కారణం పాత వివాదాలేనని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. కొండయ్య కేసులో పోలీసులకు తొలుత ఎటువంటి ఆధారాలు లభించలేదు. జేడీబీఎం చర్చి ఎదురుగా ఉన్న ఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ షాపులో ఉన్న కొండయ్యపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ దాడిలో కొండయ్యకు ఏకంగా 42 కుట్లు పడ్డాయి. లాక్‌డౌన్ డ్యూటీలో ఉన్నా డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ, ఎస్‌ఐలు రెండు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు.
సంఘటన స్థలంలో లభించిన సీసీ పుటేజీ ఆధారంగా నిందితులు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఇందుకు టెక్నికల్ సపోర్టు తీసుకుని దర్యాప్తు కొనసాగించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో చింతం రూప్‌కుమార్ అలియాస్ రూప్ (కావలి వైకుంఠపురం), నాదెండ్ల భాస్కర్(కావలి మద్దూరుపాడు). వీరు పూర్తి నేరస్వభావం ఉన్న వారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మరో వ్యక్తి కొండూరి రామస్వామి అలియాస్ రాము కూడా చిన్న చిన్న వివాదాల్లో నిందితుడిగా ఉన్నాడు. నిందితులు ఉపయోగించిన ఇనుప రాడ్డు, హీరో గ్లామర్ మోటారు సైకిల్, 4 సెల్‌ఫోన్లతో పాటు ఈ కేసుకు ప్రధాన సూత్రధారి పులుకూరి సుజయ్‌కు చెందిన ప్యాంటు, బెల్టును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అసలు కథ వెలుగులోకి..
కందుకూరు పట్టణంలోని జేడీబీఎం టౌన్ చర్చి నిర్వహణ విషయంలో 2015లో ఎన్నికలు జరిగాయి. దీని అనంతరం సభ్యుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. పులుకూరి సుజయ్ ఒక గ్రూపుగా, చదలవాడ కొండయ్య మరో గ్రూపుగా విడిపోయారు. 2016లో పెద్ద మనుషుల సమక్షంలో రెండు కమిటీలు విడివిడిగా ప్రార్థనలు చేసుకునేలా చర్చలు జరిగాయి. 2020 ఫిబ్రవరి 20న జేడీఎం టౌన్ చర్చి వార్షికోత్సవం సందర్భంగా మళ్లీ వివాదం జరిగింది. ఈ క్రమంలో చర్చి కార్యదర్శి పులుకూరి కొండయ్య.. రెండో వర్గానికి చెందిన సుజయ్ వర్గంలోని మహిళలను చర్చి నుంచి బయటకు పంపాడు. దానిపై కక్ష కట్టిన సుజయ్.. ఎలాగైనా కొండయ్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కందుకూరుకు చెందిన తాటిపర్తి అశోక్‌కుమార్, దరిమడుగు శ్రీరాం, చనమల బాలాజీ అలియాస్ బాలు అనే వ్యక్తులతో కలిసి వారి ద్వారా కావలికి చెందిన చింతం రూప్‌కుమార్, కొండూరి రామస్వామి, నాదెండ్ల భాస్కర్‌తో రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ప్రాథమికంగా సుజయ్ నుంచి అశోక్‌కుమార్ రూ.50 వేలు తీసుకుని మిగిలిన మొత్తం పని పూర్తి అయిన తర్వాత తీసుకునేందుకు అంగీకరించాడు.
తాను తీసుకున్న మొత్తంలో రూ.4 వేలు అశోక్ తీసుకుని మిగిలిన మొత్తాన్ని చనుమల బాలాజీ, దరిమడుగు శ్రీరాంలకు ఇచ్చాడు. వారు చెరో రూ.3 వేలు తీసుకుని మిగిలిన రూ.40 వేలను కందుకూరులోని మెర్సీ స్కూల్ వద్ద చింతం రూప్‌కుమార్, కొండూరి రామస్వామి, నాదెండ్ల భాస్కర్‌లకు అందించారు. అనంతరం ఫిబ్రవరి 29న ఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ సెంటర్‌లో ఉన్న కొండయ్యపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టడంతో ఆయన అపస్మార్థక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం రూప్‌కుమార్ తన వద్ద ఉన్న రూ.40 వేలలో రామస్వామికి రూ.10 వేలు, నాదెండ్ల భాస్కర్‌కు రూ.6 వేలు ఇచ్చి మిగితాది రూప్‌కుమార్ ఉంచుకున్నాడని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వివరించారు. ఒక వైపు కోవిడ్ విధుల్లో పాల్గొంటూనే మరోవైపు హత్యాయత్నం కేసును ఛేదించిన కందుకూరు డీఎస్పీ కె.శ్రీనివాసరావు, సీఐ ఎం.విజయ్‌కుమార్, టౌన్ ఎస్‌ఐ కేకే తిరుపతిరావు, హెడ్ కానిస్టేబుల్ ఎంఎం బేగ్, కానిస్టేబుళ్లు జి.దయానంద్, హరిబాబు, వీవీ లక్ష్మణస్వామి, ఎస్‌కే బాషా, ఎస్‌కే ముక్తార్‌బాషా, టి.ఆనంద్‌ను ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment