మోగిన సార్వత్రిక నగారా | Similarly, Global Press | Sakshi
Sakshi News home page

మోగిన సార్వత్రిక నగారా

Published Thu, Mar 6 2014 3:47 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

మోగిన సార్వత్రిక నగారా - Sakshi

మోగిన సార్వత్రిక నగారా

సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించింది. జిల్లాలో నెల్లూరుసిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, కావలి, ఉదయగిరి, కోవూరు (10) అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు నెల్లూరు, తిరుపతి లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

 

ఏప్రిల్ 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్ల పరిశీలన, 23న ఉపసంహరణ  ఉంటుంది. మే 7న ఎన్నికలు జరుగుతాయి. బుధవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార యంత్రాంగం  ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇప్పటికే  బూత్‌ల ఏర్పాటు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల గుర్తింపు, పోలింగ్ సిబ్బంది నియామకంతో పాటు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేసింది. మరోవైపు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

 

అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసేందుకు నేతలు వాడివేడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ  జిల్లాలోని 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసి ప్రచారంలో ముందంజలో ఉంది. వైఎస్సార్‌సీపీ నేతలు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేశారు. టీడీపీ విషయానికి వస్తే సగానికి పైగా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చే యలేక సతమతమవుతోంది. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరుసి టీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారె డ్డి, కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసలురెడ్డిలు
 
 
 బుధవారం నెల్లూరులో జరిగిన ప్రజాగర్జనలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కొత్తగా పార్టీలో చేరిన ముగ్గురిలో ఇద్దరికి ఎమ్మెల్యే సీటు,్ల ఆదాలకు నెల్లూరు ఎంపీ స్థానం కేటాయించడం దాదాపు ఖరారైంది. దీంతో మొదటి నుంచి పార్టీ జెండాలు మోసి టికెట్లపై ఆశలు పెంచుకున్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీమంత్రి రమేష్‌రెడ్డి తదితర నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇది అధినేతకు తలనొప్పిగా మారింది. దీంతో టీడీపీలో  అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక పూర్తికాలేదు. కొన్ని  నియోజక వర్గాల్లో సరైన అభ్యర్థి దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తల్లో అయోమయం, ఆందోళన నెలకొంది. ఇక రాష్ట్ర విభజన పుణ్యమాని కాంగ్రెస్ ఉనికి జిల్లాలో ప్రశ్నార్థకమైంది. ఆనం సోదరులు మినహా ఆ పార్టీకి  నేతలెవరూ మిగల్లేదు.

 

ఇక రెండోశ్రేణి నేతలు ముందే పార్టీ నుంచి నిష్ర్కమించారు. ఆయా నియోజక వర్గాల్లో  మిగిలిన ఒకరిద్దరు కిందిస్థాయి కార్యకర్తలకే పార్టీ టికెట్లు కట్టబెట్టేందుకు ఆనం సోదరులు సిద్ధమయ్యారు. మరో వైపు టీడీపీతో పొత్తు కుదిరితే ఒక్క స్థానంలో నైనా పోటీ చేద్దామని బీజేపీ ఎదురు చూస్తోంది. మొత్తంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అన్ని పార్టీల నేతలు ఎన్నికలకు  శ్రేణులను సిద్ధం చేసే పనిలో పడ్డారు. బుధవారం నుంచే మరింత హడావుడి మొదలైంది. అన్నిపార్టీల నేతలు సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన  వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు  ఇప్పటికే  మున్సిపల్ ఎన్నికలకు  నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో  కార్పొరేటర్లు, వార్డు సభ్యుల ఎంపికలో నేతలు తలమునకలయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మున్సిపల్ ఎన్నికలు రావడం అన్ని పార్టీలకు ఇబ్బందిగా మారింది.

 

 నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు  ఆత్మకూరు, వెంకటగిరి, కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు మున్సిపాలిటీలలో వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉవ్విళ్లూరు తుండగా టీడీపీ, కాంగ్రెస్ తరపున పోటీలో నిలిచేందుకు అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. నిన్నటి వరకూ నెల్లూరు కార్పొరేషన్‌లో హవా నడిపిన ఆనం సోదరులకు ఇప్పడు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. టీడీపీది సైతం నగరంలో ఇదే పరిస్థితి. మొత్తంగా అటు మున్సిపల్ ఎన్నికలు, ఇటు సార్వత్రిక ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో కోలాహలం మొదలైంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement