పశ్చిమ నియోజకవర్గం వ్యూ
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): ప్రతిసారి కొత్త అభ్యర్థిని ఎన్నుకోవడం పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల ప్రత్యేకత. ఇక్కడ ఒకసారి గెలిచిన వారికి మరుసతి ఎన్నికల్లో టికెట్ రాకపోవటమో, గెలవకపోవడమో జరుగుతుంది. ఆ సెంటిమెంట్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో 1953 నుంచి వరుసగా జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తన తదుపరి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓడిపోతూ వచ్చారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులు మంత్రులుగా కూడా చేశారు. వారు కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నికై అదే హోదాలో ఎన్నికలకు వెళితే ఓటమి కావాల్సిందే. ఈ అంశాలను నియోజకవర్గ చరిత్ర పరిశీలిస్తే తెలుస్తుంది.
పశ్చిమ నియోజకవర్గంలో 1953లో తొలిసారిగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. అందులో తొలిసారిగా తమ్మిన పోతరాజు ఎన్నికయ్యారు. ఆ తరువాత 1957లో పోతరాజుపై సీనియర్ కాంగ్రెస్ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు మరుపిళ్ల చిట్టి ఎన్నికయ్యారు. ఆ తరువాత మరుపిళ్ల చిట్టిపై 1962 ఎన్నికల్లో పోతరాజు ఎన్నికయ్యారు. ఆయనపై మళ్లీ 1967 ఎన్నికల్లో మరుపిళ్ల చిట్టి ఎన్నికయ్యారు. ఇలా ఆసిఫ్‌పాషా (1972), పోతిన చిన్నా (1978), బీఎస్ జయరాజు (1983), ఉప్పలపాటి రామచంద్రరాజు (1985), ఎంకే బేగ్ (1989), కె.సుబ్బరాజు (1994), జలీల్‌ఖాన్ (1999), షేక్ నాసర్‌వలీ (2004), వెలంపల్లి శ్రీనివాసరావు (2009), జలీల్‌ఖాన్ (2014) ఎన్నికయ్యారు. వీరిలో చాలా మంది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా వరుసగా గెలిచిన చరిత్రలో లేదు. రెండు సార్లు ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే తప్పనిసరిగా ఈ నియోజకవర్గం లో ఓటమి పాలైన చరిత్ర కొనసాగుతూనే ఉంది.
ఒకే పార్టీ వరుసగా గెలిచినా.. అభ్యర్థులు వేరు
పశ్చిమ నియోజకవర్గంలో వరుసగా ఒకే పార్టీ మూడు సార్లు గెలిచిన చరిత్ర ఉంది. అయితే మూడు సార్లు ముగ్గురు వేరువేరు అభ్యర్థులు నిలబడటంతో అక్కడ ఆ విజయం సాధ్యమైందని సీనియర్ నాయకులు చెబుతుంటారు. 1967 కాంగ్రెస్ పార్టీ నుంచి మరుపిళ్ల చిట్టి ఎన్నికయ్యారు. ఆ తరువాత 1972 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి ఆసిఫ్‌పాషా ఎన్నికయ్యారు. మూడో సారి అదే పార్టీ నుంచి 1978 ఎన్నికల్లో పోతిన చిన్నా ఎన్నికయ్యారు. ఒకే పార్టీ మూడు సార్లు గెలిచినా చరిత్ర ఈ నియోజకవర్గంలో అదే ఆఖరు. ఆ తరువాత ఒకే అభ్యర్థే కాకుండా పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలిచిన దాఖలాలు లేవు.
Comments
Please login to add a commentAdd a comment