
రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి: డీజీపీ
హైదరాబాద్ : రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి కొనసాగుతోందని రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు అన్నారు. ఆయన శనివారం 'మీట్ ది ప్రెస్'లో మాట్లాడుతూ సమస్యలు ఉన్నా పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగాయని... ఎన్నికలు ప్రశాంతంగా జరగటం పోలీసు శాఖ పనితీరుకు నిదర్శనమన్నారు. ఢిల్లీలో జరిగిన డీజీపీల సమావేశంలో కూడా రాష్ట్ర పోలీసుల్ని మెచ్చుకున్నారని తెలిపారు.
2009 నుంచి తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం జరుగుతోందన్నారు. ఈ ఏడాది జులై నుంచి సీమాంధ్రలో ఉద్యమం మొదలైందని... అయితే ఉద్యమాల ద్వారా నష్టం కలగకుండా చూడగలిగామని డీజీపీ తెలిపారు. ఉద్యమ అల్లర్ల కేసులో 300 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. గత రెండు రోజులుగా సీమాంధ్రలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుందని తెలిపారు.