సాక్షి, విశాఖ : ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద స్టైరిన్ గ్యాస్ లీకేజీ పూర్తిగా అదుపులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమ వద్ద స్టెరైన్ లీకేజీ జీరో శాతానికి చేరుకుందని ఆయన వెల్లడించారు. ఢిల్లీ, ముంబై నుంచి వచ్చిన నిపుణులు ఎల్జీ పాలిమర్స్ వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రమాద ఘటనపై రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు.భద్రతాపరంగా ఇక ఇబ్బంది ఉండదని నిపుణులు స్పష్టం చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. నిరంతరాయంగా ట్యాంక్ వద్ద స్టైరిన్ శాతాన్ని, ఉష్ణోగ్రతలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. (అణువణువూ శోధన)
ఇక ప్రమాదం జరిగిన సమీపంలోని అయిదు గ్రామాలలో నిపుణుల సూచలన మేరకు శానిటైజ్ చేయబోతున్నట్లు కలెక్టర్ చెప్పారు. ప్రజల భద్రత, ఆరోగ్యమే తమకు ప్రధానమన్న కలెక్టర్... గ్రామాలలోకి ప్రజలని అనుమతించే విషయంలో నిపుణుల సూచనలని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని మట్టి, నీరు తదితర శాంపిల్స్‌ను నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్ నిపుణులు సేకరించినట్లు కలెక్టర్ తెలిపారు. (బాబు నిర్వాకం.. విశాఖకు శాపం)
గ్రామాలలోకి ప్రజలు ఇంకా వెళ్లవద్దని, శానిటైజేషన్ ప్రక్రియకి ఒకటి, రెండు రోజులు పడుతుందని చెప్పారు. భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ప్రజలని గ్రామాలలోకి వెళ్లనిస్తామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకి ప్రభుత్వం తరపున కోటి రూపాయిల నష్టపరిహారాన్ని ఇచ్చే ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఒకట్రొండు రోజులలో బాధిత కుటుంబాలకి చెక్‌లు అందిస్తామని తెలిపారు. (నిశ్శబ్దం నిర్మానుష్యం)
Comments
Please login to add a commentAdd a comment