నాగభూషణాన్ని చెట్టుకు కట్టేసిన దృశ్యం
సాక్షి, రాజానగరం(పశ్చిమ గోదావరి): భూవివాదంలో ఓ వ్యక్తిపై ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ సంఘటనతో రాజంపేటవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మునికూడలికి చెందిన చిడిపి నాగభూషణానికి తన చిన్నాన్న చిడిపి నాగయ్యతో తొమ్మిది సెంట్ల భూవివాదం కొంతకాలంగా నడుస్తోంది. గురువారం ఉదయం 6.30 గంటలకు తన చిన్నాన్న కుమారుడు చిడిపి నాగేశ్వరావు(స్టాలిన్) మునికూడలి పంచాయతీ పరిధిలోని రాజంపేటలో ఉన్న భూమిని దున్నుతున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లాడు. అక్కడే ఉన్న స్టాలిన్, తన కుమారుడు తరుణ్‌లతోపాటుగా ఇనుగంటివారిపేటకు చెందిన నలుగురు యువకులు క్రికెట్ బ్యాట్లు, స్టంప్‌లతో నాగభూషణంపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు రాజంపేట గ్రామంలోకి పరుగులు తీశాడు. నీలవేణి అనే మహిళకు తన వద్ద ఉన్న బ్యాగ్‌ను ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పగా, అప్పటికే దాడి చేస్తున్న వారు చేరుకోవడంతో భయభ్రాంతులకు గురై ఆమె తిరిగి బ్యాగ్‌ను నాగభూషణానికి అందించింది.
నాగభూషణం నుంచి బ్యాగ్‌ను తీసుకుని కొడుతూ ఈడ్చుకుని వెళ్లి పొలం వద్ద ఉన్న కొబ్బరి చెట్టుకు కట్టేశారు. విషయం తెలిసిన నాగభూషణం కుమారుడు రాజు 100కు కాల్ చేయడంతో స్థానిక హెడ్ కానిస్టేబుల్ అప్పారావు, కానిస్టేబుల్ ప్రసాద్ వెళ్లి చెట్టుకు కట్టి ఉన్న నాగభూషణాన్ని విడిపించారు. బ్యాగ్‌లో పొలం దస్తావేజులు, రెండు బ్యాంక్ చెక్‌బుక్‌లతోపాటుగా పాస్‌బుక్‌లు, ప్రాజెక్ట్‌కు సంబంధించిన పత్రాలు, రూ.45 వేలు ఉన్నాయని భాదితుడు నాగభూషణం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న కోరుకొండ సీఐ పవన్‌కుమార్ రెడ్డి, ఎస్సై డి ఆనంద్ కుమార్ విచారించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆనంద్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment