ఊటగుండం..‘కిడ్నీ’ గండం! | Six People Died With Kidney Disease In Krishna | Sakshi
Sakshi News home page

ఊటగుండం..‘కిడ్నీ’ గండం!

Published Thu, Oct 25 2018 1:23 PM | Last Updated on Thu, Oct 25 2018 1:23 PM

Six People Died With Kidney Disease In Krishna - Sakshi

గ్రామస్తులు వినియోగిస్తున్న నీరు

సముద్రతీరానికి ఆనుకొని ఉన్న ఊటగుండం గ్రామాన్ని కిడ్నీ వ్యాధి సమస్య కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మూడు నెలల వ్యవధిలో గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ కిడ్నీ సమస్యతో బాధపడుతూ మృతిచెందడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ప్రస్తుతం గ్రామంలోని మరికొంతమంది కూడా ఈ సమస్యతో విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. తమకు అందించే తాగునీరు కలుషితమవ్వడం వల్లే కిడ్నీ వ్యాధి సమస్య తమ గ్రామానికి మహమ్మారిలా పట్టిందని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు.

కోడూరు (అవనిగడ్డ) : కోడూరు మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీకి చెందిన ఊటగుం డం గ్రామం సముద్రతీరానికి ఆనుకొని ఉంటుం ది. ఈ గ్రామంలో మొత్తం 200 కుటుంబాలకు చెందిన 700మంది జనాభా నివాసముంటున్నా రు. ఇక్కడ గ్రామస్తులు నిత్యం తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. వీరందరికి నాగాయలంక మండలం కమ్మనమోల పంపుహౌస్‌ నుంచి తాగునీటిని పైప్‌లైన్‌ ద్వారా సరఫరా చేస్తారు. అయితే ఈ గ్రామం చిట్టచివరన ఉండడంతో కుళాయిల వెంట తాగునీరులో చెత్తచెదారాలతో కూడిన మురుగు నీరు వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఇంటి అవసరాలకు ఉపయోగించుకునే నీరు పూర్తిగా పసర్లు కమ్మి ఉంటాయని వాపోయారు. గ్రామంలోని కుళాయిల వద్ద కూడా మురుగు పెరుకుపోయి పారిశుద్ధ్యం లోపించిం దని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడు నెలల్లో ఆరుగురు మృతి..
తాగునీరు కలుషితమవ్వడం వల్ల తమ వారికి కిడ్నీ వ్యాధి సోకిందని ఊటగుండం గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. ఈ నీరు తాగడం వల్లే మూడు నెలల వ్యవధిలో గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందారని వాపోతున్నారు. రెండు రోజుల క్రితం కురాకుల వెంకటేశ్వరరావు(52) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు గ్రామస్తులు చెప్పారు. అదే గ్రామానికి చెందిన దేవనబోయిన శ్రీనివాసరావు (47), ఆరేపు ఆంజ నేయులు (55), దేవనబోయిన వెంకటేశ్వరమ్మ(42), కూచిబోయిన వెంకాయమ్మ (62), కురాకుల కోటేశ్వరరావు (50) కూడా కిడ్నీ సమస్యతో నే మృతిచెందినట్లు వివరిస్తున్నారు. వీరందరు విజయవాడలోని పలు ప్రైవేటు ఆసుపత్రిల్లో చికి త్స పొందగా, వీరికి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు వైద్యులు రిపోర్టులు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు.

పెరుగుతున్న బాధితుల సంఖ్య..
ప్రసుత్తం మరికొంతమంది గ్రామస్తులు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు ఇక్కడవారు చెబుతున్నారు. కొంతమంది అయితే ఈ వ్యాధి తమకు కూడా సోకుతుందనే భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు.

గ్రామం వైపు చూడని పాలకులు..
మూడు నెలల వ్యవధిలో ఆరుగురు గ్రామస్తులు కిడ్నీ సమస్యతో చనిపోయినా తమ గ్రామానికి సమస్య తెలుసుకునేందుకు వచ్చిన అధికారి గాని, ప్రజాప్రతినిధి గాని లేరని ఇక్కడ వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ఊటగుండం వాసులు కోరుతున్నారు.

ఇద్దరు సోదరులను కోల్పోయాను
మూడు నెలల వ్యవధిలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఇద్దరు సోదరులను కోల్పోయాను. వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావులు కలుషితమైన నీరు తాగడం వల్లే ఈ వ్యాధి సోకింది. వీరికి విజయవాడలో చికిత్స చేయిస్తే కిడ్నీల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకిందన్నారు. రూ.లక్షలాది ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది.                  – కురాకుల రంగారావు, గ్రామస్తుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement