చుక్కనీరు లేని నూజివీడు బ్రాంచి కాలువ
నూజివీడు: ఎన్నెస్పీ మూడో జోన్ పరిధిలోని నూజివీడు నియోజకవర్గానికి సాగర్‌జలాలను సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రానున్న వేసవిలో ఈ నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడిని ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా సాగర్‌జలాలను విడుదల చేసి చెరువులను నింపాల్సి ఉంది. అయితే జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జిల్లాకు చెందిన వాడైనప్పటికి సాగర్‌జలాలను తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు నియోజకవర్గంలో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాలుండగా, నూజివీడు, ఆగిరిపల్లి మండలాలకు నూజివీడు మేజర్ ద్వారా, చాట్రాయి, ముసునూరు మండలాలకు వేంపాడు మేజర్ ద్వారా సాగర్‌జలాలను సరఫరా చేయాల్సి ఉంది.
అయితే జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా గాని, సంబంధిత జలవనరుల శాఖాధికారులు గాని సాగర్‌జలాలను తీసుకురావాలనే ఆలోచన చేస్తున్న దాఖలాలు లేవు. ఎప్పుడో అక్టోబర్‌లో 10 రోజుల పాటు వచ్చిన సాగర్‌జలాలే తప్ప ఆ తరువాత ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా రాలేదు. మూడోజోన్‌కు షెడ్యూల్ ప్రకారం నవంబరు 15 నుంచి మార్చి 15 వరకు సాగర్‌జలాలు సరఫరా కావాల్సిఉంది. రబీ సీజన్‌లో ఆరుతడి పంటలకు సాగునీరే కాకుండా, వేసవిలో మంచినీటి ఎద్దడి ఎదురుకాకుండా నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ నింపాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఇవ్వాల్సిన సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి తీసుకురాకుండా ఇప్పటివరకు కాలం గడిపేశారు. కొన్ని మండలాలకు ఇంతవరకు అసలు సాగర్‌జలాలు రాలేదు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ప్రతిఏటా ఇదే తంతు జరుగుతోంది తప్ప సాగర్‌జలాలను తీసుకువచ్చిన దాఖలాలు లేవు.
బోరుమంటున్న చెరువులు
వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయని, వడగాడ్పులు కూడా ఉధృతంగా వీస్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో సుమారు 65 చెరువులను సాగర్‌జలాలతో నింపాల్సి ఉంది. లేకపోతే గ్రామాల్లో భూగర్భజలాలు పడిపోవడంతో పాటు మనుషులకు, పశువులకు నీళ్లు దొరకని పరిస్థితులు నెలకొంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సాగర్‌జలాలు రప్పించి చెరువులను నింపాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment