తరగతి గదిలో శ్రద్ధగా చదువుకుంటున్న బాలికలు
గుంటూరు, సత్తెనపల్లి: బడి ఈడు పిల్లలందరికీ విద్యనందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం విద్యాశాఖ సమగ్రశిక్షా అభియాన్ ద్వారా పలు కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోంది. అనేక కారణాల వల్ల చాలా మంది 11 నుంచి 14 ఏళ్లలోపు బాలికలు పాఠశాల విద్యకు దూరమవుతున్నారు. వారిలో అధిక శాతం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలే. వారికి రెసిడెన్షియల్ పద్దతిలో ఆరు నుంచి పదో తరగతి వరకు గుణాత్మక విద్యను అందించడానికి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. వీటిని మన రాష్ట్రంలో 2005 ఆగస్ట్14న ప్రారంభించారు. బాలికల అక్షరాస్యతా శాతం, రాష్ట్ర అక్షరాస్యతా శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 352 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉండగా, మన జిల్లాలో 24 ఉన్నాయి. ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన కేజీబీవీలు నేడు వేలాది మంది విద్యార్థినిలకు ఉచితంగా విద్యనందిస్తున్నాయి. గతంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉచితంగా విద్యనందించేవారు. ప్రస్తుతం జిల్లాలోని నాదెండ్ల, బెల్లంకొండ కేజీబీవీల్లో ఇంటర్ వరకు విద్యనందిస్తున్నాయి. కొన్ని విద్యాలయాల్లో ఆంగ్ల మాద్యమంలోనే విద్య నందించడం విశేషం. విద్యతో పాటు కంప్యూటర్, ఆటలు, కరాటే, యోగ, ధ్యానం తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చి బాలికలోల ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు.
జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాలు
జిల్లాలో 24 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో మూడు మైనార్టీలకు కేటాయించారు. నరసరావుపేట, పిడుగురాళ్ల, పోతవరం (చిలకలూరిపేట) వీటిల్లో మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేక అవకాశం కల్పించారు. నాదెండ్ల, బెల్లంకొండలో ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యనందిస్తున్నారు. సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు, దాచేపల్లి, గురజాల, పిల్లుట్ల, రెంటచింతల, దుర్గి, మాచర్ల ,వెల్దుర్తి, కారంపూడి,రొంపిచర్ల, వినుకొండ, బొల్లాపల్లి, నూజెండ్ల, ఈపూరు, క్రోసూరు, అచ్చంపేట ప్రాంతాల్లో కేజీబీవీలు కొనసాగుతు న్నాయి. ఒక్కో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో తరగతికి 40 మంది చొప్పన 200 మంది చదువుతున్నారు. అలా 24 కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో 4,800 మంది విద్యార్థినులు చదువుకుంటున్నట్లు అంచనా. ప్రతి విద్యార్థినికి పౌష్టి కాహారాన్ని అందిస్తున్నారు. ప్రతి రోజూ గుడ్డు, వారానికి ఒకసారి కోడి మాంసాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి విద్యా సంవత్సరంలో ఉచితంగా పుస్తకాలు, శుద్ధి చేసిన నీరు ఏర్పాటు చేశారు. బాలికల ఖర్చుల కోసం ప్రతి నెలా కాస్మోటిక్ చార్జీలు అందిస్తుంది. ప్రతినెలా వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులను అంద జేస్తారు. ప్రతి కేజీబీవీలకు కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. విద్యతో పాటు కంప్యూటర్‌లో ప్రావీణ్యం పెంచేలా శిక్షణ ఇస్తారు.
దరఖాస్తుల స్వీకరణ
జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలో 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు తెలిపారు. 7, 8 తరగతుల్లో ఖాళీలను మాత్రమే భర్తీ చేయనుండగా 6వ తరగతిలోకి కొత్తగా ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి గల వారు మే ఒకటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్థినుల పురోగతికి సోపానం
కేజీబీవీలు పేద విద్యార్థినుల పురోగతికి సోపానాలు. ఈ విద్యాలయాల్లో చేరిన బాలికలకు అన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. చదువుతో పాటు నాయకత్వ నైపుణ్యాలు, యోగ, ధ్యానం, కరాటే తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. ప్రవేశాలకు రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ ఉంటుంది. మే ఒకటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్ లింక్ రానుంది. – బి.రాజ్యలక్ష్మి, డీసీడీఓ, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment