
వాళ్లెందుకు తెల్లన?
* జన్యుమార్పే కారణమంటున్న సీసీఎంబీ
* అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో కలిసి అధ్యయనం
* భారతీయులతోపాటు యూరోపి యన్లలోనూ ఒకేతరహా జన్యుమార్పు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో ఏ మూలకెళ్లినా అక్కడి మనుషుల రంగుల్లో ఎన్నో తేడాలు కనిపిస్తాయి. కొందరు తెల్లగా, మరికొందరు చామనఛాయతో, ఇంకొందరు నల్లగా! ఉన్న ప్రాంతాన్నిబట్టి శరీరాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించుకునేందుకు ప్రకృతి చేసిన ఏర్పాటు ఇదని పరిణామ సిద్ధాంతం చెబుతుంది. చర్మంలో మెలనిన్ అనే రసాయనం మోతాదు, విస్తృతుల ఆధారంగా మన రంగు నిర్ణయమవుతుందనీ మనకు తెలుసు.
అయితే ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నవాళ్లకు తెల్లరంగు ఉందంటే అర్థం చేసుకోవచ్చుగానీ.. భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాల్లోని కొంత మంది కూడా యూరోపియన్ల మాదిరిగానే తెల్లరంగుతో మెరిసిపోయేందుకు కారణమేమిటి? ఈ ప్రశ్నకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సమాధానం కనుక్కుంది. శరీర రంగును నిర్ధారించే జన్యువుల్లో ఒకటైన ‘ఎస్‌ఎల్‌సీ 24 ఏ5’లో వచ్చిన మార్పులే దీనికి కారణమని ఈస్టోనియాలోని టర్టూ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలతో కలిసి సీసీఎంబీ నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది.
20 వేల ఏళ్ల క్రితమే తెల్లని భారతీయులు!
‘‘భారత్‌లోని కొంతమందిపై మేం పరిశోధనలు జరిపాం. ఎస్‌ఎల్‌సీ 24 ఏ5 జన్యువు ఆధారంగా వారి చర్మపు రంగులోని తేడాలను అర్థం చేసుకోగలిగాం. అంతేకాదు.. ఈ జన్యువులోని మ్యూటేషన్ (సూక్ష్మస్థాయిలో జరిగే మార్పు-ఉత్పరివర్తనం) కారణంగా కొంతమంది చర్మపు రంగు తెల్లగా ఉన్నట్లు స్పష్టమైంది’’ అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
భారతీయులతోపాటు యూరోపియన్లలోనూ ఈ మ్యూటేషన్ కనిపిస్తుందని, ముఖ్యంగా ఉత్తర భారతీయులకూ యూరోపియన్లకు మధ్య ఉన్న జన్యుపరమైన సంబంధాన్ని ఇది మరింత స్పష్టం చేస్తుందన్నారు. ఈ జన్యుపరమైన మార్పు సుమారు 22-28 వేల ఏళ్ల క్రితమే జరిగిందని, పరిణామ క్రమంలో మనిషి శరీరపు రంగు ఎప్పుడు మారిందో అర్థం చేసుకునేందుకు తమ అధ్యయనం దోహదపడుతుందని వివరించారు.
‘‘చర్మపు రంగులో వచ్చిన మార్పును అర్థం చేసుకునేందుకు మాత్రమే కాకుండా.. మరింత విసృ్తత అధ్యయనం ద్వారా సౌందర్యపోషణ పదార్థాలను మరింత సమర్థంగా ఎలా వాడాలో కూడా ఈ అధ్యయనం చెబుతుంది’’ అని సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ మోహనరావు పేర్కొన్నారు. ఈ పరిశోధన వివరాలు ‘పీఎల్‌ఓఎస్ జెనెటిక్స్’ మ్యాగజైన్‌లో ప్రచురితమయ్యాయి.