వచ్చే ఎన్నికల్లో స్లిప్పులిస్తాం: భన్వర్‌లాల్
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్
వాటిద్వారా ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవచ్చు
ఓటరు చూశాక అవి బాక్స్‌లోకి వెళ్తాయి
కొత్త ఓటర్లలో 75 శాతం యువతే
ఫిబ్రవరి నెలాఖరు వరకు ఓటర్లుగా నమోదు
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశామన్న వివరాలు తెలిపే స్లిప్పును ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. అయితే ఇది ప్రయోగాత్మకంగా కొన్ని నియోజకవర్గాలకే పరిమితం చేయనున్నట్లు చెప్పారు. స్లిప్పును ఓటరుకు ఇవ్వబోమనీ, తామెవరికి ఓటు వేశామనేది ఓటరు నిర్ధారించుకున్నాక ఆ స్లిప్పును మరో బాక్స్‌లో వేస్తామని వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదట్లో ఈ నోటిఫికేషన్ వస్తుందన్నారు. రాజ్యసభ ఎన్నికలు, సాధారణ ఎన్నికల బందోబస్తు, పోలీసు అధికారుల బదిలీలకు సంబంధించి ఆయన గురువారం సచివాలయంలో డీజీపీ ప్రసాదరావుతో సమావేశమై చర్చించారు.
మూడేళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న అధికారుల బదిలీ, సమాచార వ్యవస్థ లేనిచోట పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం, రాష్ట్రంలోని 95 బెటాలియన్‌ల సీఆర్‌పీఎఫ్ బలగాలకు రెండు వారాల శిక్షణ, పోలీసు అధికారులెవరూ స్వంత జిల్లాల్లో ఉండకుండా బదిలీ చేయాలని సూచించినట్లు భన్వర్‌లాల్ తెలిపారు. డీఎస్పీ స్థాయి నుంచి బదిలీలు ప్రభుత్వానికి వస్తాయని, సీఐ స్థాయిలోపు స్థానిక అధికారులు బదిలీ చేస్తారని చెప్పారు.
కొత్తగా నమోదైన ఓటర్లలో 60 లక్షల ఓటర్లు యువకులేనని తెలిపారు. తాము ఆశించిన దానిలో 75 శాతం ఓటర్లుగా నమోదు అయ్యారని, మరో 25 శాతం ఓటర్లు చదువుల కోసం రాష్ట్ర బయట ఉన్నందున నమోదు చేసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు.
కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి గుర్తింపుకార్డులను కలర్‌లో ఇవ్వనున్నందున, మార్చి ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు ఓటర్లుగా నమోదు కావచ్చని, అందువల్ల ఫిబ్రవరి చివరివరకు ఓటర్లుగా నమోదు చేసుకోని వారికి ఇంకా సమయం ఉందని అన్నారు.