పొలం బలం.. ఇలా పదిలం | Soil fertility to replacement 'Navbharat' investigations | Sakshi
Sakshi News home page

పొలం బలం.. ఇలా పదిలం

Published Thu, Nov 13 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

పొలం బలం.. ఇలా పదిలం

పొలం బలం.. ఇలా పదిలం

* భూసారం భర్తీకి ‘నవభారత్’ పరిశోధనలు
* చెరకుకు ముందు అపరాల విత్తుల జల్లకం
* 45 రోజుల తర్వాత దున్నేస్తే చక్కని ఫలితం

సామర్లకోట :‘కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే..’ అన్నాడో కవి. ఎంత బలమైన పొలమైనా.. ఏటా సాగుతో, పంటల్ని పిండుకుంటుంటే.. దాని సారమూ అలాగే తరిగిపోతుంది. మరి.. దాన్ని తిరిగి భర్తీ చేసుకోవాలంటే? దానికీ మార్గాలున్నాయంటోంది దీనిపై పరిశోధనలు చేసిన సామర్లకోటలోని నవభారత్ వెంచర్స్ (చక్కెర ఫ్యాక్టరీ).  చెరకు పండించే సమయంలో రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూసారం తగ్గిపోతుంటుంది.

చెరకును పండించే సమయంలో క్రిమి సంహారక మందులు ఎక్కువగా వినియోగించడమూ భూసారం క్షీణతకు కారణమవుతుంది. పర్యవసానంగా చెరకు దిగుబడీ పడిపోతుంది. దీని నివారణకు పరిశోధనలు చేసిన నవభారత్ అందుకు ఉపాయాలను సూచిస్తోంది. భూసారం పెంచడానికి కందులు, మినుములు, పెసలు, ఆవాలు, మిరియాలు, ధనియాలు, చోళ్లు, జనుము, సజ్జలు, బొబ్బర్లు, మెంతుల వంటివి కలిపి చెరకు పంట వేసే ముందు పొలంలో వెదజల్లాలి. 45  రోజుల తరువాత పెరిగిన మొక్కలను దుక్కి దున్నాలి. దాంతో భూమిలోని సారం పెరుగుతుంది. అప్పటి వరకు ఎకరం చెరకు 30 టన్నుల దిగుబడి వస్తే ఈ విధంగా చేయడం ద్వారా 35 నుంచి 40 టన్నులకు పెరిగే అవకాశం ఉందని నవభారత్ వెంచర్స్ వైస్ చైర్మన్ నాగభైరవ ప్రభాకర్ అన్నారు. అలాగే చెరకు నాటే సమయంలో ఖాళీ ఎక్కువగా ఉంచి నాటడం వల్ల గాలి ఎక్కువగా వేయడానికి అవకాశం ఉండి చెరకు గెడ నాణ్యత పెరుగుతుందని తెలిపారు.

చెరకు ముచ్చులను దగ్గర దగ్గరగా వేయడం వల్ల కలుపు పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు నారు మొక్కలను నాట్లుగా రైతులకు అందజేస్తోంది. ఈ కారణం గా రైతులకు 45 రోజుల వ్యవధి తగ్గడమే కాక ఆ మేరకు పెట్టుబడీ తగ్గుతుంది. చెరకు మధ్య ఖాళీ ఎక్కువగా ఉండటం వల్ల అంతర్ పంట లుగా బెండ, వంగ, టమాటా, మిర్చి వంటివి వేసుకోవచ్చు. వాటిని కూడా రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యమే ఉచితంగా అందజేస్తుంది.

చెరకు మొక్కలు వేయడానికి లోతుగా దుక్కి దున్నాలని, ఎరువుల వాడకంలో అవగాహన పెంచుకోవాలని ప్రభాకర్ చెప్పారు. తోటకు తక్కువ నీటిని వాడటం ద్వారా చెరకులో నాణ్యతను పెంచుకోవచ్చన్నారు. భూసార పరిరక్షణతో పాటు ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన సూచనలు, సలహాలు పాటిస్తే అధిక దిగుబడిని, తద్వారా మెరుగైన రాబడిని పొందవచ్చన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement