తెలంగాణ ఏర్పాటుతోనే సమస్యలు పరిష్కారం
Published Wed, Sep 4 2013 4:47 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
ఆలంపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ ఏర్పడిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులంతా పర్మినెంట్ అవుతారని టీఆర్‌ఎస్ చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొండా బాలకృష్ణారెడ్డి గార్డెన్‌లో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తగిన వేతనాలు లేక కాంట్రాక్టు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ ఏర్పాటైన వెంటనే వారిని పర్మినెంట్ చేస్తామన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు వివరించామన్నారు. ఇవన్ని జరగాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని, ఆ దిశగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ నిధులన్నీ సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు తీసుకుపోవడంతో వైద్య, ఆరోగ్యశాఖలో నిధులలేమి ఏర్పడి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షబీర్ అహ్మద్ మాట్లాడుతూ.. సీమాంధ్రులు చేసే కృత్రిమ ఉద్యమాలకు భయపడేది లేదన్నారు. తెలంగాణలో పనిచేస్తూ సీమాంధ్రకు మద్దతుఇచ్చే వారిని తరిమికొట్టే సమయం ఆసన్నమైందన్నారు.
రాష్ట్ర కార్యదర్శి సాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వసతులు లేక మహిళాసిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.నాగేందర్‌గౌడ్ మాట్లాడుతూ.. సీమాంధ్రుల దోపిడీకి గురవుతున్న శాఖల్లో వైద్య ఆరోగ్యశాఖ ఒకటన్నారు. తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎం.రవీందర్, ఉపాధ్యక్షుడి బి.జంగయ్యను ఎన్నుకున్నారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన గోపాల్‌రెడ్డి పదోన్నతిపై మెదక్ జిల్లాకు బదిలీ కావడంతో నూతనంగా కమిటీని ఎన్నుకున్నారు.
కార్యక్రమంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌రావు, నాయకులు ఎస్.రవీందర్, శివశంకర్, సతీష్‌గౌడ్, నవీన్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, టీఆర్‌ఎస్ నాయకులు రామస్వామి, వేమారెడ్డి, కృష్ణయ్య, రాంచంద్రారావు, టీఎస్‌జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శుభప్రద్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement