అధికార పార్టీ నేతలపైనే కేసులా?
నెల్లూరు : 'అధికార పార్టీ నేతలపైనే కేసులు పెడతారా? రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. వారి సంగతి చూస్తాం' అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు. ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నెల్లూరు కార్పొరేషన్లో, జెడ్పీ సమావేశ మందిరంలోనూ తమ నేతలు శాంతియుతంగా ఆందోళన చేశారన్నారు.
జెడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కలెక్టర్ శ్రీకాంత్ను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దూషించలేదని, కేవలం మైక్ను మాత్రమే పక్కకు తోశారన్నారు. అంతమాత్రాన ఎమ్మెల్యేపై కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. కార్పొరేషన్లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఏజేసీపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కురుగొండ్లపై కేసు ఎత్తివేయకుంటే అధికారుల పనితీరుపై సీబీఐ, సీఐడీలతో దర్యాప్తు చేయిస్తామని సోమిరెడ్డి హెచ్చరించారు.