నాన్న గుండె ఆగింది.. | son death matter not reach to father | Sakshi
Sakshi News home page

నాన్న గుండె ఆగింది..

Published Fri, Nov 21 2014 12:39 AM | Last Updated on Tue, Oct 9 2018 2:39 PM

నాన్న గుండె ఆగింది.. - Sakshi

నాన్న గుండె ఆగింది..

ఆ తండ్రి హృదయం కొడుకును చూడాలని తపించింది. రెండు నెలలు ఆశగా నిరీక్షించింది. బిడ్డ క్షేమంగా ఉంటే చాలని భావించింది. జైలులో ఉన్న కొడుకు కోసం ఆకలిదప్పులు మరచిపోయాడా తండ్రి. మంచినీళ్లయినా ముట్టలేదు. నిద్రకు దూరమయ్యాడు. భోంచేయమని ఎవరెంత నచ్చచెప్పినా వినలేదు. ఫలితంగా కొడుకును చూడకుండానే కన్నుమూశాడు. తండ్రి మరణ వార్త కొడుక్కి ఇప్పటికీ తెలియకపోవడం మరో విషాదం. గుండెలు పిండేసే ఈ హృదయ విదారక పరిణామం కొయ్యూరు మండలంలో జరిగింది.
 
కొయ్యూరు : మూడు నెలల కిందట జంగాలతోటలో నరేశ్‌ను మావోయిస్టులు హతమార్చారు. అతని హత్యలో సంబంధం ఉందని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వై.రామవరం పోలీసులు కిలో పద్మనాభంను అరెస్టు చేసి జైలులో ఉంచారు. దీంతో పద్మనాభం తండ్రి ఆనందరావు (50) తీవ్ర మనోవేదనకు గురయ్యా డు. కొడుకు విడుదల కావాలని తపన పడ్డాడు. తిండీతిప్పలు మాని చివరకు ఆ బెంగతో ప్రాణాలే కోల్పోయాడు. ఇంటి పెద్ద మరణించాడు. చెట్టంత కొడుకు జైలు పాలయ్యాడు. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నామని పద్మనాభం తల్లి, భార్య బిడ్డలు కన్నీటి పర్యంతమవుతున్నారు.  

యు.చీడిపాలెం పంచాయతీ గొంధికోటకు చెందిన కిలో పద్మనాభం ఐదు సంవత్సరాల కిందట ముంచింగ్‌పుట్ మండలం తామరాపల్లి నుంచి వలస వచ్చి వ్యవసాయం చేసి జీవిస్తున్నాడు. పద్మనాభం తన తండ్రి ఆనందరావును కిందటి సంవత్సరం గొంధికోటకు తీసుకువచ్చాడు. మూడు నెలల కిందట వై.రామవరం పోలీసులు పద్మనాభంపై కేసు నమోదు చేసి, జైలుకు పంపారు. అప్పటి నుంచి తండ్రి ఆనందరావు కొడుకుపై బెంగ తో మంచం పట్టాడు. కొడుకు వచ్చేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టేది లేదని శపథం చేశాడు. రెండు నెలలపాటు ఆకలితో చిక్కిశల్యమైన ఆనందరావు చివరకు ఈనెల 8న మరణించాడు. మంగళవా రం పసుపునీళ్లు (పెద్దకర్మ)ను నిర్వహించారు.

మరణించిన రోజే వచ్చిన పోలీసులు
ఆనందరావు మరణించిననాడు తూర్పుగోదావరి పో లీసులు గొంధికోట వచ్చారు. మీ కారణంగానే ఆనందరావు మరణించారని కుటుంబ సభ్యులు పోలీసుల పై ఆరోపణలు చేశారు. ఏ తప్పూ చేయని పద్మనాభా న్ని నరేశ్ కేసులో ఇరికించారని ఆవేదన చెందారు. ఈ విషయం పద్మనాభంకు తెలియజేస్తామని చెప్పి పోలీ సులు వెళ్లిపోయారు. ఆనందరావుకు పద్మనాభం ఒక్క డే కొడుకు కావడంతో మృతదేహానికి తలకొరివి పెట్టేవారు లేక చివరకు గ్రామస్తులే కర్మకాండలు చేశారు. గొంధికోటను సందర్శించిన ‘న్యూస్‌లైన్’ ఎదుట పద్మనాభం భార్య శాంతి, తల్లి తులసమ్మ కన్నీరుమున్నీరయ్యారు.

పద్మనాభానికి ఎవరితో సంబంధాలు లేకపోయినా పోలీసులు తప్పుడు ఫిర్యాదును ఆధారంగా చేసుకుని కేసులో ఇరికించారని వారు ఆవేదన చెందారు. బెయిల్ పెట్టేందుకు ఆర్థిక స్థోమత లేదని చెప్పారు. కొడుకును చూడకుండానే తండ్రి కన్నుమూశారని, తల్లి కూడా కొడుకుపై బెంగతో అన్నం తినడం లేదని చెప్పారు. పద్మనాభానికి ఇద్దరు కొడుకులు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement