Koyyuru Mandal
-
జనావాస పరిసరాల్లోకి గొరగేదెలు.. భయపడుతున్న జనం
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో గొరగేదెలు జనావాస ప్రాంతాల్లోకి వచ్చేస్తుండటంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పైడిపనుకుల, మంప, సూరేంద్రపాలెం పరిసర ప్రాంతాల్లో ఇవి సంచరిస్తున్నట్టుగా వారు చెబుతున్నారు. వేసవి తీవ్రత, అటవీప్రాంతంలో తాగునీరు అందుబాటులో లేకపోవడమే అవి బయటకు రావడానికి కారణంగా చెబుతున్నారు. కొయ్యూరు: అటవీ ప్రాంతంలో ఉండాల్సిన గొరగేదెలు (బైసన్స్) గ్రామాల సమీపంలోకి వచ్చేస్తున్నాయి. దీంతో వాటిని చూసిన గిరిజనులు భయపడుతున్నారు. వేసవి కావడంతో దాహం తీర్చుకునేందుకు, చల్లదనం కోసం కాలువల వెంబడి ఉంటున్నాయి. గత ఐదేళ్లక్రితం వరకు ఒడిశాకు చెందిన వేటగాళ్లు వీటిని వేటాడేందుకు వచ్చేవారు. నెల రోజుల పాటు కాలువల వెంబడి కాసి నాటు తుపాకులతో వాటిని వేటాడి చంపేవారు.ఆ మాంసాన్ని ఎండిబెట్టి గ్రామాలకు తరలించేవారు. 2016 ఫిబ్రవరిలో ఎం.భీమవరం పంచాయతీ పుట్టకోట సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో నాటు తుపాకులు కలిగి ఉన్న ఇద్దరు ఒడిశా గిరిజనులను మావోయిస్టులుగా అనుమానించి అప్పటిలో పోలీసులు కాల్చి చంపారు. అప్పటి నుంచి ఒడిశా వేటగాళ్లు రావడం తగ్గించేశారు. ఈ ప్రాంతంలో గతంలో రెండు పులులు ఉన్నట్టు అటవీశాఖ నిర్ధారించింది. తరువాత జరిగిన జంతు గణనలో వాటి జాడ తెలియలేదు. దీంతో గొరగేదెల సంఖ్య పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. గొరగేదెలు ఎక్కువగా గూడెం,చింతపల్లి, కొయ్యూరు సరిహద్దు గ్రామాల్లో తిరుగుతుంటాయి. మర్రిపాకల రేంజ్లో ఫారెస్టు చాలా దట్టంగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో వీటి మంద ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలం, శీతాకాలంలో మేత, నీరు అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఇవి అటవీ ప్రాంతాన్ని వదిలి బయటకు రావు. వేసవి వచ్చేసరికి అటవీ ప్రాంతంలో చిన్న చిన్న ఊట కాలువలు ఎండిపోతాయి. వాటి చర్మం పలుచగా ఉన్నందున వేడిని తట్టుకోలేవు. అందువల్ల ఎక్కువగా ఇవి నీటిలోనే ఉండేందుకు ఇష్టపడతాయి. పెద్ద కాలువల వద్దనే ఉంటాయి.అక్కడే నీళ్లు తాగి తిరుగుతాయి. వేటగాళ్లు కూడా కాలువల వెంబడే ఉంటారు.అవి నీరు తాగుతున్న సమయంలో తుపాకీతో వేటాడుతారు. లేదంటే సంప్రదాయ ఆయుధాలతో చంపేందుకు ప్రయత్నిస్తారు. గాయపడిన గేదెలు కనిపించిన వారిని చంపేందుకు చూస్తాయి. ఇలాంటి సమయంలోనే వీటి నుంచి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మందతో ప్రమాదం లేదు గొరగేదెలు మందలుగా ఉన్నప్పుడు ఎవరిని ఏమీ అనవు. ఒంటరిగా ఉన్న గేదెలు మాత్రమే దాడులు చేసేందుకు చూస్తాయి. అవి దాడులు చేస్తే ప్రాణాలతో బయటపడడం కష్టంగానే ఉంటుంది. ఒంటరిగా ఉన్న గేదె, గాయపడిన వాటితోనే ప్రమాదం ఉంటుందని గిరిజనులు తెలిపారు. పైడిపనుకుల, మంపకు అటువైపున ఉన్న కొండ, సూరేంద్రపాలెం ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి. గాయపడిన గేదె ఒకటి తిరుగుతుందని తెలుసుకున్న పరిసర ప్రాంతీయులు భయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దట్టమైన అడవిలోనే గొరగేదెలుంటాయి. వాటిపై ఎలాంటి లెక్కలు లేవు. అంచనాగా చెప్పడం తప్ప అవి ఎన్ని ఉంటాయో గణన చేయలేదు. వేసవి కావడంతో అవి నీటి వనరులున్న ప్రాంతాలకు వస్తాయి.అవి ఏయే ప్రాంతాల్లో తిరుగుతున్నాయో అటవీ సిబ్బందిని పంపించి పరిశీలన చేయిస్తాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా మర్రిపాకల రేంజ్‌లోనే ఉన్నట్టుగా సమాచారం ఉంది. – సూర్యనారాయణ పడాల్, నర్సీపట్నం డీఎఫ్‌వో -
మేకపిల్లను మింగిన కొండచిలువ
కొయ్యూరు: విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీ సింగరాలపాడు అడవిలో శనివారం కొండచిలువ మేకపిల్లను మింగింది. సింగరాలపాడుకు చెందిన మేకల కాపర్లు మేతకోసం మేకలను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. సుమారు ఆరు అడుగుల పొడవున్న కొండచిలువ ఒక మేక పిల్లని మింగింది. కాపర్లు వెంటనే కర్రలు, కత్తులతో కొండచిలువపై దాడి చేసి దాన్ని చంపారు. కొండచిలువ నోటిని చీల్చి మేకపిల్లని క్షేమంగా బయటకు తీశారు. -
నాన్న గుండె ఆగింది..
ఆ తండ్రి హృదయం కొడుకును చూడాలని తపించింది. రెండు నెలలు ఆశగా నిరీక్షించింది. బిడ్డ క్షేమంగా ఉంటే చాలని భావించింది. జైలులో ఉన్న కొడుకు కోసం ఆకలిదప్పులు మరచిపోయాడా తండ్రి. మంచినీళ్లయినా ముట్టలేదు. నిద్రకు దూరమయ్యాడు. భోంచేయమని ఎవరెంత నచ్చచెప్పినా వినలేదు. ఫలితంగా కొడుకును చూడకుండానే కన్నుమూశాడు. తండ్రి మరణ వార్త కొడుక్కి ఇప్పటికీ తెలియకపోవడం మరో విషాదం. గుండెలు పిండేసే ఈ హృదయ విదారక పరిణామం కొయ్యూరు మండలంలో జరిగింది. కొయ్యూరు : మూడు నెలల కిందట జంగాలతోటలో నరేశ్‌ను మావోయిస్టులు హతమార్చారు. అతని హత్యలో సంబంధం ఉందని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వై.రామవరం పోలీసులు కిలో పద్మనాభంను అరెస్టు చేసి జైలులో ఉంచారు. దీంతో పద్మనాభం తండ్రి ఆనందరావు (50) తీవ్ర మనోవేదనకు గురయ్యా డు. కొడుకు విడుదల కావాలని తపన పడ్డాడు. తిండీతిప్పలు మాని చివరకు ఆ బెంగతో ప్రాణాలే కోల్పోయాడు. ఇంటి పెద్ద మరణించాడు. చెట్టంత కొడుకు జైలు పాలయ్యాడు. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నామని పద్మనాభం తల్లి, భార్య బిడ్డలు కన్నీటి పర్యంతమవుతున్నారు. యు.చీడిపాలెం పంచాయతీ గొంధికోటకు చెందిన కిలో పద్మనాభం ఐదు సంవత్సరాల కిందట ముంచింగ్‌పుట్ మండలం తామరాపల్లి నుంచి వలస వచ్చి వ్యవసాయం చేసి జీవిస్తున్నాడు. పద్మనాభం తన తండ్రి ఆనందరావును కిందటి సంవత్సరం గొంధికోటకు తీసుకువచ్చాడు. మూడు నెలల కిందట వై.రామవరం పోలీసులు పద్మనాభంపై కేసు నమోదు చేసి, జైలుకు పంపారు. అప్పటి నుంచి తండ్రి ఆనందరావు కొడుకుపై బెంగ తో మంచం పట్టాడు. కొడుకు వచ్చేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టేది లేదని శపథం చేశాడు. రెండు నెలలపాటు ఆకలితో చిక్కిశల్యమైన ఆనందరావు చివరకు ఈనెల 8న మరణించాడు. మంగళవా రం పసుపునీళ్లు (పెద్దకర్మ)ను నిర్వహించారు. మరణించిన రోజే వచ్చిన పోలీసులు ఆనందరావు మరణించిననాడు తూర్పుగోదావరి పో లీసులు గొంధికోట వచ్చారు. మీ కారణంగానే ఆనందరావు మరణించారని కుటుంబ సభ్యులు పోలీసుల పై ఆరోపణలు చేశారు. ఏ తప్పూ చేయని పద్మనాభా న్ని నరేశ్ కేసులో ఇరికించారని ఆవేదన చెందారు. ఈ విషయం పద్మనాభంకు తెలియజేస్తామని చెప్పి పోలీ సులు వెళ్లిపోయారు. ఆనందరావుకు పద్మనాభం ఒక్క డే కొడుకు కావడంతో మృతదేహానికి తలకొరివి పెట్టేవారు లేక చివరకు గ్రామస్తులే కర్మకాండలు చేశారు. గొంధికోటను సందర్శించిన ‘న్యూస్‌లైన్’ ఎదుట పద్మనాభం భార్య శాంతి, తల్లి తులసమ్మ కన్నీరుమున్నీరయ్యారు. పద్మనాభానికి ఎవరితో సంబంధాలు లేకపోయినా పోలీసులు తప్పుడు ఫిర్యాదును ఆధారంగా చేసుకుని కేసులో ఇరికించారని వారు ఆవేదన చెందారు. బెయిల్ పెట్టేందుకు ఆర్థిక స్థోమత లేదని చెప్పారు. కొడుకును చూడకుండానే తండ్రి కన్నుమూశారని, తల్లి కూడా కొడుకుపై బెంగతో అన్నం తినడం లేదని చెప్పారు. పద్మనాభానికి ఇద్దరు కొడుకులు.