
మామను హతమార్చిన అల్లుడు
కుటుంబ కలహాలతో మామను కిరాయి రౌడీలతో కలిసి హత్య చేసిన అల్లుడి ఉదంతమిది.
► కిరాయి రౌడీలతో ఘాతుకం
► కుటుంబ కలహాలే కారణం
► విప్పర్ల గ్రామంలో ఘటన
► పరారీలో నిందితులు
క్రోసూరు: కుటుంబ కలహాలతో మామను కిరాయి రౌడీలతో కలిసి హత్య చేసిన అల్లుడి ఉదంతమిది. ఈ ఘటన మండలంలోని విప్పర్ల గ్రామంలో సోమవారం వేకువజామున చోటుచేసుకుంది. బంధువుల కథనం మేరకు... సత్తెనపల్లి మండలంలోని గార్లపాడు గ్రామానికి చెందిన కొండవీటి వెంకటకృష్ణయ్య(63) కు భార్య, ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడున్నాడు. నలుగురు కుమార్తెలకు వివాహాలు చేసారు. నాల్గో కుమార్తె వాణిని మూడేళ్ల కిందట భట్టూరుకు చెందిన ఈదర అంకమ్మరావుతో వివాహం చేశారు. వాణి మానసికస్థితి సరిగా లేదని అంకమ్మరావు తరచూ అత్తమామలతో ఘర్షణ పడుతుండేవాడు.
ఐదో కుమార్తెను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేయటం ప్రారంభించాడు. అల్లుడి ప్రతిపాదనను అత్తమామలు అంగీకరించకుండా కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల రోజుల నుంచి విప్పర్లల్లోని రెండో అల్లుడు ఇంట్లో ఉంటున్నారు. తన మాట వినటం లేదని మామపై అంకమ్మరావు కసిపెంచుకున్నాడు.
కిరాయిరౌడీలను కారులో విప్పర్ల తీసుకొచ్చి వెంకటకృష్ణయ్య ఉన్న ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి జొరపడ్డారు. ఇంట్లో ఉన్న వెంకట కృష్ణయ్య, కుటుంబసభ్యులందరూ భయాందోళనకు గురై వేరే గదుల్లోకి పోయి తలుపులు వేసుకున్నారు. ఆ తలుపులు కూడా పగలగొట్టి కృష్ణయ్యను బయటకు ఈడ్చు కొచ్చి బీర్జాల పై కొట్టిచంపినట్లు తెలిపారు.
కుటుంబసభ్యులు వేసిన కేకలకు ఇరుపొరుగు జనం చేరుకున్నప్పటికీ వారిపై కూడా దాడి చేసి నిందితులు పారిపోయారు. సంఘటన గ్రామంలో కలకలం లేపింది. సత్తెనపల్లి డీఎస్పీ మధూసూదనరావు, సీఐ కొటేశ్వరరాావు, ఎస్‌ఐ ఏవీ బ్రహ్మం సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు.