తన గుండెలపై ఆడుకుంటుంటే ఎక్కడ బిడ్డల పాదాలకు నొప్పి పుడుతుందోనని బుజ్జగించిన నాన్నను.. నేడు ఆ బిడ్డలే కర్కశంగా రోడ్డున పడేశారు. జీవితమంతా పిల్లలను కాపాడేందుకు గొడుగుగా మారిన నాన్నను.. నేడు ఆ పిల్లలే దుర్మార్గంగా ఎర్రటి ఎండలో వదిలేశారు. తాను పేగులు మాడ్చుకుని తమ కడుపు నింపిన తండ్రిని.. నేడు ఆ బిడ్డలే భారంగా భావించి చిల్లచెట్ల మధ్య దూరంగా పారేశారు. మలమలమాడే ఎండలో.. చిక్కిన శరీరంతో..అచేతనంగా పడిన ఆయన పిల్లల అమానుషానికి బతికుండానే .. జీవచ్ఛవంగా మారాడు. కన్నపేగు బంధమా ? నీ చిరునామా ఎక్కడ అంటూ మానవ సంబంధాలను బేల కళ్లతో ప్రశ్నించాడు.
తెనాలి అర్బన్: స్థానిక తెనాలి చెంచుపేటలోని ఇండోర్ స్టేడియం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఓ వ్యక్తి కదలలేని స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి మద్యం మత్తులో పడి ఉండవచ్చని భావించారు. మధ్యాహ్నం ఒంటి గంట దాటినా అక్కడి నుంచి వెళ్లకపోవడంతో అనుమానం వచ్చి అతడి వద్దకు వెళ్లారు. చర్మ సంబంధ వ్యాధితో బాధపడుతూ పడి ఉన్నాడు. వెంటనే వారు దుప్పటి కప్పి త్రీటౌన్ సీఐ ఆశోక్‌కుమార్‌కు సమాచారం అందించారు. ఏఎస్‌ఐ వీవీ రమణరావును వచ్చి వివరాలు సేకరించారు. తన పేరు కోటేశ్వరరావు అని, ఇద్దరు బిడ్డలని, వారే తీసుకొచ్చి ఇక్కడ పడేశారని చెప్పాడు. అంతకు మించి ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. వెంటనే ఏఎస్‌ఐ అతడిని జిల్లా వైద్యశాలలో చేర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment