సాక్షి, కడప: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ, అందుకు కారణమైన యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ పుట్టిన రోజును జిల్లా వాసులు బ్లాక్‌డేగా జరుపుకున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కడప నగరంలో ఉపాధ్యాయ జేఏసీ నేత లెక్కల జమాల్‌రెడ్డి, విద్యార్థి జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
నల్లజెండాలతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. కోటిరెడ్డి సర్కిల్ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా, సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇన్సాఫ్ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు నాగేంద్రకుమార్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు సిగ్గులేకుండా పదవుల్లో కొనసాగుతున్నారన్నారు. వెంటనే కేంద్రప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోకపోతే ప్రజల్లో తిరగనీయబోమన్నారు.
సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు శ్రీరామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సోనియా గాంధీ తన బర్త్‌డే కేక్‌ను కట్ చేసినట్లు రాష్ట్రాని చీల్చాలనుకోవడం సహించరాని విషయమన్నారు. బద్వేలు ఏపీ ఎన్జీవోలు సోమవారాన్ని బ్లాక్‌డేగా పాటించారు. నల్లజెండాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. పులివెందులలో విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరలించి ర్యాలీ నిర్వహించారు.
సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నందలూరులో పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, అందుకు నిరసనగా సోమవారాన్ని బ్లాక్‌డేగా పరిగణిస్తున్నామన్నారు. ప్రొద్దుటూరులో న్యాయవాదులు బ్లాక్‌డే పాటించారు. నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేపట్టారు.
రాష్ట్రానికి విద్రోహ దినం
Published Tue, Dec 10 2013 6:22 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement