
ఈవెంట్ బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, విశాఖపట్నం: సాగరతీరంలోని ఇసుక తిన్నెలపై ఈ నెల 11, 12 తేదీల్లో సౌండ్స్ ఆన్ సాండ్ పేరిట సంగీత లహరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. విశాఖ పర్యాటక ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు ఆరు మెగా ఈవెంట్లను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులోభాగంగా మొదటి కార్యక్రమం సౌండ్స్ ఆన్ సాండ్ అని చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి కళాకారులు పాల్గొంటారన్నారు. 11 ఉదయం 7 గంటలకు బైజు ధర్మజాన్, విజయ్ హెగ్డే, సాయంత్రం 4.30 గంటలకు సంగీతంపై అభిలాష ఉన్న వారికి వర్క్‌షాప్, 5 గంటలకు ఎకో అండ్ కైరోజ్ కార్యక్రమం, రాత్రి 7 నుంచి పాప్‌సింగర్ ఉషా ఊతప్ సంగీత విభావరి, 8.30కి ప్రముఖ కళాకారులు లెస్లీ లెవీస్‌ల సంగీత కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
12 ఉదయం 7 గంటలకు నడి వయసు వారు ఇష్టపడే డబ్లీ కార్యక్రమం, సాయంత్రం 4.30 గంటలకు సంగీత వర్క్‌షాప్, 5.30కి స్థానిక కళాకారులతో క్వాయర్ కళాబృందం సాంస్కృతిక ప్రదర్శన, రాత్రి 7 గంటలకు ఇండియన్ ఐడల్ రేవంత్ గీతాలాపన, 8.30నుంచి టాలీవుడ్ నేపథ్య గాయకులు మహ్మద్ ఇర్ఫాన్, ఆసీస్ కౌర్‌లతో సంగీత కార్యక్రమాలుంటాయని వివరించారు. ఫేస్‌బుక్‌లో లాగిన్ అయి ఎక్కడ నుంచైనా కార్యక్రమాన్ని వీక్షించవచ్చన్నారు.
14 నుంచి 18 వరకు పలు కార్యక్రమాలు
ఈ నెల 14 నుంచి 16 వరకు అరకులో బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 10, 11 తేదీల్లో నగరంలో కలెక్టర్ల సదస్సు జరుగుతుందని, దీనికి దేశంలోని వంద జిల్లాల నుంచి 62 మంది కలెక్టర్లు, 40 మంది ఇతర ఉన్నతాధికారులు హాజరవుతున్నారన్నారు. అలాగే 15 నుంచి 17 వరకు అగ్రిహ్యాకథాన్, 17, 18 తేదీల్లో జాతీయ స్థాయి టూర్ ఆపరేటర్ల సమావేశం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఈడీ శ్రీరాములునాయుడు, డీటీవో పూర్ణిమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment