
సాక్షి, విశాఖపట్నం : మరో రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు నైరుతి రుతుపవనాలు చల్లని తీపికబురును అందిచనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శుక్రవారం నుంచి వర్షపాతం పెరిగే అవకాశముంది. దీంతో ఈ సారి వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
గత కొన్ని రోజులుగా నైరుతి రుతుపవనాలు పయనిస్తూ బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో దక్షిణ ప్రాంతానికి విస్తరించిన అండమాన్ దీవులకు చేరాయి. కాగా ప్రస్తుతం విదర్భ నుంచి తెలంగాణ ఏపీ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు లేదా మోస్తారు వర్షాలు, పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.