సాగులలో సాహసం
- మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలో ఎస్పీ దుగ్గల్ సద్భావన యాత్ర
- ద్విచక్రవాహనంపై ప్రదర్శనగా ప్రయాణం
- పాతికేళ్లలో ఎస్పీ పర్యటన ఇదే ప్రథమం
- మారుమూల ప్రాంతాల్లో కాలినడకన పర్యటన
- గిరిజనులతో మమేకం.. అడవిబిడ్డల ఆత్మీయ స్పందన
గూడెం కొత్తవీధి, న్యూస్‌లైన్ : మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా పేరొందిన సాగుల అటవీ ప్రాంతంలో ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ సాహసోపేత రీతిలో పర్యటించారు. అసాధారణ రీతిలో అడవుల్లోకి అడుగుపెట్టి గిరిజనులతో మమేకమయ్యారు. సద్భావన యాత్ర జరిపి దుర్గమ ప్రాంతాల్లో గిరిజన గూడేల్లో కలయతిరిగారు. గత ఏడాది ఫిబ్రవరిలో సాగుల గ్రామ గిరి జనులపై మావోయిస్టులు దాడిచేయడంతో ముగ్గురు గిరిజనులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం మంజూరు చేసింది. దీనిని నేరుగా సాగుల గ్రామంలో నివాసముం టున్న కుటుంబసభ్యులకు అందజేయాలన్న ఉద్దేశంతో పోలీసులు సోమవారం సద్భావనయాత్ర నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పా ల్గొనేందుకు జిల్లా ఎస్పీ దుగ్గల్ సోమవారం జి.కె.వీధి చేరుకున్నారు. జి.కె.వీధి నుండి ద్విచక్రవాహనాలపై అటవీ మార్గంలో ర్యాలీగా తరలివచ్చారు. కొంత దూరం ప్రయాణించి అక్కడ నుండి వాహనం కూడా వెళ్లలేని పరిస్థితుల్లో అధ్వానంగా ఉన్న రహదారుల్లో కాలినడకన ఎ స్పీ తన బృందంతో సాగుల గ్రామానికి చేరుకున్నారు. తొలిసారిగా తమ గ్రామానికి చేరుకున్న జిల్లా ఎస్పీకి గిరిజనులు బ్రహ్మరథం పట్టారు. పూలదండలు వేసి హారతులు పట్టి ఎస్పీకి ఘనస్వాగతం పలికారు. పాతికేళ్లలో ఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ పర్యటించడం ఇదే ప్రథమం.
సాయం పంపిణీ : సాగులలో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు గిరిజనులు బవుడు తొండయ్య, అడపా బాలయ్యపడాల్, వంజరి హనుమంతరావుల కుటుంబాలకు తలా రూ. 5 లక్షల సాయం అందజేశారు. ఇందుకు సంబంధించిన బ్యాంకు పాస్ పుస్తకాలను మృతుల కుటుంబసభ్యులకు ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. అంతకుముందు ఈ యాత్రకు హాజరైన గిరిజనులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు.
చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన వందలాది మంది గిరిజనులకు దుప్పట్లు, చీరలు, గిరిజన యువతకు వాలీబాల్ కిట్లనుపంపిణీ చేశారు. కార్యక్రమం అనంతరం సదస్సుకు హాజరైన గిరిజనులతో ఎస్పీ దుగ్గల్, నర్సీపట్నం ఓఎస్డీ దామోదర్, చింతపల్లి డీఎస్పీ అశోక్‌కుమార్, ఇతర పోలీసు అధికారులు సహపంక్తి భోజనం చేశారు.
భద్రత నడుమ పర్యటన : మావోయిస్టు కంచుకోటగా పేరొందిన గ్రామాలలో ఎస్పీ స్థా యి అధికారి తొలిసారిగా పర్యటించడతో జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసింది. ఎస్పీ పర్యటించిన అన్ని గ్రా మాల్లో ఆదివారం రాత్రే ప్రత్యేక బలగాలను మోహరించారు. గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ, సీఆర్‌పీఎఫ్ బలగాలు గాలింపుచర్యలు ముమ్మ రం చేశాయి. పాతికేళ్లుగా ఎస్పీ స్థాయి అధికారి ఒక్కరూ అడుగుపెట్టని ప్రాంతంలో దుగ్గల్‌పర్యటించారు. యాత్ర విజయవంతం కావడంతో పోలీసు యంత్రాం గం ఊపిరి పీల్చుకుంది. కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ శ్రీహరి, జి.కె.వీధి సీఐ రాంబాబు, చింతపల్లి సీఐ ప్రసాద్, ఎస్‌ఐలు విజయ్‌కుమార్, కోటేశ్వరరావు, నర్సింహమూర్తి పాల్గొన్నారు.