తిరుమలలో పెరుగుతున్న కాలిబాట భక్తుల కోసం కొత్త కాంప్లెక్స్ నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది.
టీటీడీ నిర్ణయం
సాక్షి, తిరుమల: తిరుమలలో పెరుగుతున్న కాలిబాట భక్తుల కోసం కొత్త కాంప్లెక్స్ నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం అనువైన స్థలం పరిశీలించాలని టీటీడీ ఈవో సాంబశివరావు మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు స్థల సేకరణ పూర్తిచేసి సమగ్ర సర్వే చేసి నివేదిక ఇవ్వనున్నారు.
తిరుమలలో మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 52,910 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఇదే సమయానికి సర్వదర్శనం కోసం రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి వెలుపల కిలోమీటరు వరకు క్యూ కట్టారు. వీరికి 14 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. కాలి బాట భక్తులకు క్యూ వెలుపలి వరకు ఉంది. వీరికి 9 గంటల తర్వాతే శ్రీవారి దర్శనం లభించనుంది. హుండీ కానుకలు రూ. 2.31 కోట్లు లభించాయి. పెరిగిన రద్దీ కారణంగా మంగళవారం వీఐపీ టికెట్లను కూడా తక్కువగానే కేటాయించారు.