స్థలాన్ని పరిశీలించిన కేంద్ర కమిటీ సభ్యులు
బుక్కరాయసముద్రం : జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు న్యూఢిల్లీ కేంద్ర మంత్రిత్వ శాఖ హెఆర్‌డీ జాయింట్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి సుఖ్‌బీర్ సింగ్ తెలిపారు. జిల్లాలో సెంట్రల్ యూనివ ర్సిటీ నిర్మాణం కోసం మండల పరిధిలోని జంతులూరు గ్రామంలో స్థల పరిశీలన కోసం సెంట్రల్ కమిటీ సభ్యులు మంగళవారం పర్యటించారు. కేంద్ర మంత్రిత్వ శాఖ హెచ్‌ఆర్‌డీ జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి సుఖ్‌బీర్ సింగ్ సాధు నేతృత్వంలో అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ అజయ్‌కుమార్ ఖండూరీ, రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత్రాదారా, హైదరాబాద్ యూనివర్సిటీ వీసీ హరిబాబు ఈ కమిటీలో ఉన్నారు.
రాష్ట్ర సమాచార శాఖ, ఐటీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి, కలెక్టర్ కోన శశిధర్ హాజరయ్యారు. ముందుగా జంతులూరు గ్రామంలోని ఓపన్ ఎయిర్ జైలుకు సంబంధించిన 500 ఎకరాల పొలాన్ని తొలుత ఈ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ పొలం చుట్టూ ఉన్న వనరులను మంత్రి, ప్రభుత్వ విప్, కలెక్టర్ వారికి వివరించారు. అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరం ఉందని, అనంతపురం-తాడిపత్రి నాలుగు లైన్ల రహదారి పక్కనే ఈ భూమి ఉందని తెలిపారు. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి 160 కిలోమీటర్ల దూరం, జంతులూరు గ్రామానికి 10 కిలోమీటర్లు దూరంలో నేషనల్ హైవే-44 ఉందని కమిటీ సభ్యులకు వివరించారు.
గ్రామ సమీపంలో తుంగభద్ర ఎగువ కాలువ , పీఏబీఆర్, మిడ్ పెన్నార్ డ్యాంలు ఉన్నాయన్నారు. హంద్రీ నీవా సుజల స్రవంతి మొదటి దశ పూర్తి చేసుకుని రెండో దశ నిర్మాణం పూరోగతిలో ఉందని, వీటి ద్వారా నీటి కొరత ఉండదని అన్నారు. జిల్లా కేంద్రం 6 కిలోమీటర్ల దూరంలో యూనివర్సిటీలు, సర్వ జన వైద్యశాల, ప్రభుత్వ వైద్య కళాశాల, జేఎన్‌టీయూ, ఎస్‌కే యూనివర్సిటీ, అనేక ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలు, డిగ్రీ, జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయని వారు కమిటీకి వివరించారు. భవిష్యత్తులో అనంతపురంలో విమానాశ్రమం కూడా ఏర్పాటు కానుందని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జంతులూరు అన్ని విధాలా ఎంతో అనుకూలమని వారు తెలిపారు. కమిటీ వెంట ఆర్డీఓ హుసేన్ సాహెబ్, జెడ్పీటీసీ రామలింగారెడ్డి, తహశీల్దార్ సుబ్బలక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు
Published Wed, Apr 1 2015 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM
Advertisement