
నవరత్నాలు –3
బతకాలనేది రోగులందరి ఆశ.. ఆ ఆశకు వైద్యమే శ్వాస.. ఇప్పుడా శ్వాసకు గడ్డు కాలం నడుస్తోంది. నిలువ నీడలేని, రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల వారికి నేడు ఏదైనా పెద్ద జబ్బు వస్తే.. ప్రమాదాల బారిన పడితే ‘రేపటి రోజు’కు రూపు కరువైన దుస్థితి. రోగమొస్తే ఇక అంతే.. అనే దయనీయ పరిస్థితి రాజ్యమేలుతోంది. అధైర్య పడొద్దు.. బతికిస్తాం.. అనే భరోసా ఇవ్వడానికి పాలకులకు మనసొప్పని దౌర్భాగ్యపు రోజులివి. చావు బతుకులతో బడ్జెట్ లెక్కలు వేసి ‘మీ చావు మీరు చావండి’ అని వదిలించుకుంటున్న వైనం కళ్లారా చూస్తున్నాం. అర్ధాయుష్షుతో తనువు చాలించకుండా చూసేందుకు వైద్యులకు అవకాశం ఇవ్వని వైనమూ కంటున్నాం. ‘ఈ రోజులు పోవాలి. మళ్లీ వైఎస్సార్ నాటి స్వర్ణ యుగం రావాలి’ అని కోట్లాది మంది కోరుకుంటున్నారన్నది అక్షర సత్యం. ఆ రోజు త్వరగా రావాలి. ప్రజలంతా ఆరోగ్యంగా జీవించాలి.
– సాక్షి, అమరావతి / సాక్షి నెట్‌వర్క్
అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దిగులుగా కూర్చున్న రఘుపతి దంపతులు
ఇప్పుడేం చేసేది
మా ఆయన రఘుపతి కూలి పని చేసి కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు. వారం క్రితం కూలి పనికి పోయినప్పుడు ఇసుక తిన్నెలు మీద పడటంతో కుప్ప కూలిపోయినాడు. నడవలేక పోవడంతో ఆటో మాట్లాడుకుని వెంటనే తాడిపత్రిలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఎక్స్‌రే తీసి చూశారు. కాలు విరిగిందని, ఆపరేషన్ చేసి రాడ్ వేయాలని చెప్పినారు. టెంపరరీ కట్టు కట్టారు. అనంతపురం తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వ అంబులెన్స్ కోసం చాలా సేపు ఎదురు చూశాం. ఎంతసేపటికీ రాకపోవడంతో 1,500 రూపాయలిచ్చి ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకుని అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాం. అక్కడ వెంటనే వైద్యం అందే పరిస్థితి లేదని అర్థమైంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఆరోగ్య శ్రీ కార్డు చూపించి, ఆపరేషన్ చేయాలని (ఎన్‌టీఆర్ వైద్య సేవ సిబ్బందిని) కోరాం. ఎంతసేపటికీ వాళ్లు ఏమీ చెప్పలేదు. ఆ ఆసుపత్రిలో చూపించుకోవడానికి వచ్చిన ఒకాయన మా పరిస్థితి చూసి వాళ్లతో మాట్లాడారు. ఆసుపత్రికి గవర్నమెంటోళ్ల నుంచి రావాల్సిన డబ్బులు (బకాయిలు) రాలేదని, అందుకే ఆపరేషన్లు చేయడం లేదని మాకు చెప్పాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. డబ్బులిచ్చి వైద్యం చేయించుకోవాలంటే 40 వేల రూపాయలు అవుతుందని చెప్పారు. కూలి పనులు చేసుకునే మాకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. పక్కన పల్లెలో ఎవరో కట్టు కడతారని (నాటు వైద్యం) చెప్పారు. ఎలాగైనా 5 వేల రూపాయలు తీసుకుని రావాలని మా పిన్ని వాళ్లకు ఫోన్ చేసి చెప్పాను. వాళ్లు రాగానే మా ఆయన్ను అక్కడికి తీసుకెళ్లాం. అక్కడ ఏం చేస్తారో.. ఏమో.. మా ఖర్మ.
– రఘుపతి భార్య, ఆలూరు, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా
భర్త వద్ద దిగాలుగా కూర్చున్న కాంతమ్మ
ఈ పరిస్థితి పగోళ్లకు కూడా రాకూడదు..
మా ఆయన అప్పలస్వామి (60)కి కొన్నాళ్ల క్రితం కిడ్నీ దెబ్బతినిందని చెప్పారు. ఎందుకు దెబ్బతినిందో తెలీదు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చూపించాం. మందులిచ్చారు. వాడాము. కొన్నాళ్ల తర్వాత వ్యాధి మరింత ముదిరింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సరిగా అందలేదు. దీంతో రెండెకరాల పొలం అమ్మాము. ఏకంగా 15 లక్షల రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేశాము. అయినా వ్యాధి ముదిరిపోయింది. డబ్బులన్నీ అయిపోయాయి. ఇప్పటికే అప్పులపాలయ్యాం. డయాలసిస్ చేయించడానికి కూడా ఇప్పుడు డబ్బులు లేవు. మా ఆయన్ను దక్కించుకోవడం ఎలానో తెలీక తల్లడిల్లిపోతున్నాం. ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లో రోగులు క్యూకట్టారు. మరిన్ని కేంద్రాలు ఉండుంటే వెంట వెంటనే డయాలసిస్ చేయించడానికి వీలవుతుంది. మేము పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ఇలాంటి కష్టం పగోడికి కూడా రాకూడదని కోరుకుంటున్నాం.
– కాంతమ్మ, లొహరిబంద, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా
కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నా..
భర్త, పిల్లలతో కలిసి ఆనందంగా బతుకుతున్న రోజులవి. నా భర్త గురయ్య 15 ఏళ్ల క్రితం నన్నొదిలి కనిపించని లోకాలకు వెళ్లిపోయాడు. క్షయ వ్యాధి ఆయన్ను కబళించింది. తర్వాత ఐదేళ్లకు
(ఇప్పుడు నాకు 48 ఏళ్లు) నేను వైద్య పరీక్షలు చేయించుకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధి ఉందని తేలింది. ఆ విషయం వినగానే గుండె ఆగినంత పనైంది. భవన నిర్మాణ పనులకు వెళ్లి పొట్ట పోసుకుంటున్న నాకు ఈ వ్యాధి రావడం బాధనిపించింది. మా ఆయన లేడు. ఇద్దరు పిల్లలు దుర్గారావు, భాస్కరరావులు ఇంకా చదువుకుంటున్నారు. డాక్టర్లు చూస్తే మందులు వాడుతూ బాగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఇలాగైతే ఇల్లు గడిచేదెలా? బాధను పంటి బిగువున భరిస్తూనే పనులకు వెళ్తున్నాను. రెండేళ్లుగా నా సమస్య మరింత ముదిరింది. దీంతో పిల్లలు 10వ తరగతి వరకు చదివి ఆపేశారు. ఆటో తోలుతున్నారు. ఇప్పుడు నాకు వారానికి మూడు మార్లు డయాలసిస్ చేయాల్సి వస్తోంది. మందుల కోసం నెలకు 8 వేల రూపాయలు ఖర్చవుతోంది. పిల్లలు సంపాదించింది నా ఖర్చులకే సరిపోతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. పలాసలో డయాలసిస్ కేంద్రం పెట్టారు కాని అక్కడ పడకలు లేవు. పిల్లలు ఆటో తోలుతున్నారు కాబట్టి దారి ఖర్చులు కాస్త కలిసొస్తున్నాయి. లేకుంటే ప్రత్యేకంగా ఆటో తీసుకుని వెళ్లాల్సి వచ్చేది. ప్రభుత్వం బస్సు పాస్‌లు ఇస్తామని ప్రకటించిందే కానీ ఇవ్వలేదు. మరోవైపు ఇల్లు గడవడం బాగా కష్టంగా మారింది. ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎంత త్వరగా ముఖ్యమంత్రి అవుతారా అని కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నా. ఎందుకంటే మా లాంటోళ్లకు ఆయన నెలకు రూ.10 వేలు పింఛన్ ఇస్తామన్నారు.
– మీలపల్లి పుణ్యావతి, గుణుపల్లి గ్రామం,వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా
వైఎస్ జగన్‌తోనే ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం ఆ రోజుల్లో పేదలకు ఒక ధీమా కల్పించింది. రోజు కూలీలు సైతం హైదరాబాద్‌కు వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రుల్లో పైసా ఖర్చు లేకుండా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నారు. ఏ ఒక్క రోగీ చికిత్సకు డబ్బులేదని బాధ పడకూడదనేది వైఎస్సార్ ధ్యేయం. ఆయన తనయుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు మించితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని చెబుతుండటం రోగుల్లో భరోసా నింపుతోంది. ఎంతో మంది రోగులు ఇతర రాష్ట్రాలకు వైద్యం కోసం వెళ్లే అవకాశం ఉన్నా సర్కారు అనుమతి లేక బాధ పడుతున్నారు. ఇలాంటి వారందరికీ ఉపశమనం కలుగుతుంది. మూడింట రెండొంతులకు పైగా జనం లబ్ధి పొందనున్నారు. గుండె జబ్బులు, కిడ్నీ, నరాల జబ్బులు, క్యాన్సర్ వంటి రోగాలకు మంచి చికిత్స అందుతుంది. జగన్ సీఎం అయితేనే మళ్లీ ఈ పథకానికి పూర్వ వైభవం వస్తుందని నిత్యం ఎంతో మంది రోగులు మందుల కోసం ఇక్కడి కొచ్చినప్పుడు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు, కష్టాలు భవిష్యత్‌లో కనిపించే పరిస్థితే ఉండదన్న నమ్మకం ఉంది. జగన్ త్వరగా ముఖ్యమంత్రి అయితే లక్షలాది మంది పేదలు మృత్యు ముఖం నుంచి తప్పించుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రోజు కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు.
– గాండ్ల ఆదినారాయణ, మెడికల్ షాపు యజమాని, అనంతపురం.
ఇదీ వైఎస్సార్ ఘనత
ప్రమాదకర జబ్బు వస్తే ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందక, కార్పొరేట్ ఆస్పత్రుల మెట్లు ఎక్కే తాహతు లేక ప్రాణాలు కోల్పోతున్న దశలో పేదలు, సామాన్యుల కష్టాలను దగ్గరి నుంచి చూసిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2007 ఏప్రిల్ ఒకటిన పైలెట్ ప్రాజెక్టుగా ఆరోగ్యశ్రీని మూడు జిల్లాల్లో అమలు చేశారు. తర్వాత ఏడాది తిరక్కముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాల్లోనూ అందుబాటులోకి తెచ్చారు. తొలుత 468 జబ్బులతో మొదలైన ఈ పథకం ఏడాది తిరక్కముందే 938 జబ్బులకు చికిత్స అందే స్థాయికి చేరింది. గుండె జబ్బు నుంచి కాలేయ జబ్బు వరకు, క్యాన్సర్ నుంచి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ వరకు.. ఏ జబ్బుకైనా సరే, ఏ కార్పొరేట్ ఆస్పత్రి అయినా సరే వెనుదిరిగి చూడకుండా వైద్యం చేయించిన రోజులవి. జబ్బు బారిన పడిన వారికి చికిత్సతో పాటు వైద్యం జరిగినన్ని రోజులూ భోజనం, రవాణా చార్జీలు సైతం ఆస్పత్రిలోనే చెల్లించిన తీరు సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఓ చరిత్ర. పుట్టుకతోనే మూగ, చెవుడు ఉన్న చిన్నారులు ఒక్కొక్కరికి కాక్లియర్ ఇంప్లాంట్స్ వేసినందుకు రూ.6.5 లక్షలు చెల్లించారు. ఆరోగ్యశ్రీకి ఏటా రూ.925 కోట్లు చెల్లించారు. ఈ మొత్తం తక్కువైందని సీఎం సహాయ నిధి కింద ఏటా రూ.400 కోట్లు చెల్లించి చరిత్ర పుటల్లో నిలిచారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ తరహా ప్రాజెక్టు దేశంలో ఇంత పకడ్బందీగా ఎక్కడా అమలు కాలేదు. లక్షలాది మంది ఇన్ పేషెంట్లకు ప్రాణం పోసింది. చాలా విజయవంతమైన కార్యక్రమం ఇది. 80 శాతం కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చి ఉచితంగా వైద్యం అందించడం అంటే మాటలు కాదు. దీనివల్ల పేదలు తమ వైద్యం కోసం ఆస్థులమ్ముకునే దుస్థితి తప్పింది’ అని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సోఫీ బెర్గ్‌విస్ట్, ఆడం వాగ్‌స్టాఫ్, అనురాధా కాత్యాల్, ప్రబాల్ వి.సింగ్, అమిత్ సామ్రాట్, మాలారావులు అప్పట్లో కొనియాడారు.
ఇదీ బాబు నిర్వాకం
- పుట్టుకతోనే మూగ, చెవుడు చిన్నారులకు వైద్యం చేయించుకునే వయసు 12 ఏళ్ల నుంచి రెండేళ్లకు తగ్గింపు. (దీంతో వేలాది మంది చిన్నారులు వైద్యం చేయించుకోవడానికి అర్హత కోల్పోయారు)
- 938 జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉండగా అందులో 133 జబ్బులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయకూడదని నిర్ణయం. ప్రభుత్వాసుపత్రుల్లోనే చేయాలని నిబంధన.
- 1600 మంది ఆరోగ్యమిత్రల తొలగింపు.
- కాక్లియర్ ఇంప్లాంట్స్ వేసే ఆస్పత్రులు నెలకు ఒక కొత్త కేసు మాత్రమే తీసుకోవాలని ఆదేశం.
- ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకునే వీలు లేదని ఆంక్షలు. (మన రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం హైదరాబాద్ స్థాయిలో ఇంకా అభివృద్ధి కాలేదు)
- ప్రమాదంలో గాయపడిన (పాలీట్రామా) బాధితులకు వైద్యం అందించేందుకు ప్యాకేజీ రేట్లు సరిపోవడం లేదని ఆస్పత్రుల నిరాకరణ.
- న్యూరో, కాలేయ బాధితులకు వైద్యం చేసేందుకు చాలా చోట్ల ఆస్పత్రుల నిరాకరణ.
- రోగులకు మార్గదర్శకం చేసే ఆరోగ్య మిత్రల తొలగింపు. (ప్రస్తుతం కోర్టు ఉత్తర్వులతో కొందరు ఉద్యోగంలో కొనసాగుతున్నారు)
- ఆరోగ్యశ్రీ ట్రస్ట్.. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు రూ.600 కోట్లు బకాయి పడటంతో 2019 జనవరి 1వ తేదీ నుంచి సేవల నిలిపివేత.
- సొంతూళ్లలో రేషన్ తీసుకుంటేనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని లింకు. తద్వారా పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లిన పేదలు వైద్యానికి అనర్హులయ్యేలా చేశారు.
మీ ఆరోగ్యానికి నాదీ భరోసా : వైఎస్ జగన్
ఏడాదికి రూ. 1 లక్ష నుంచి రూ. 10 లక్షలు లబ్ధి
పిల్లలను ఉన్నత చదువులు చదివించినప్పుడో, కుటుంబీకులకు పెద్ద జబ్బు వచ్చినప్పుడో పేదలు అప్పులపాలవుతారని దివంగత మహానేత, నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చెప్పేవారు. వాళ్ల జీవితాలు చెదిరిపోకూడదనే ఉద్దేశంతోనే ఆయన ‘ఆరోగ్య శ్రీ’ ప్రారంభించారు. ఆ పథకం ద్వారా ఎంతో మంది ప్రజలు ఉచితంగా ఆపరేషన్లు చేయించుకున్నారు. కానీ గత
నాలుగున్నరేళ్లుగా పరిస్థితి దారుణంగా తయారైంది. ఆరోగ్య శ్రీ కార్డు పట్టుకుని హైదరాబాద్‌కు పోతే.. ఏపీ కార్డులు అక్కడ చెల్లవని అంటున్నారు. 108కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో అంబులెన్స్ వస్తోందా? మూడు నెలలుగా సిబ్బందికి జీతాల్లేవు.. డీజిల్ లేదని సమాధానం వస్తోంది. ఈ దుర్మార్గపు పాలన ముగిసి, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘ఆరోగ్య శ్రీ’లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సమున్నతంగా అమలు చేస్తాం. ఆ దివంగత నేత కుమారుడిగా పేదల కోసం నేను రెండడుగులు ముందుకు వేస్తానని చెబుతున్నా.
- ఏపీలోని పేదలు వైద్యం కోసం దేశంలోని ఏ నగరానికి వెళ్లినా,
- ఏ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా అందుకు అయ్యే
- ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.
- వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం.
- కిడ్నీ, తలసేమియా.. లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో
- బాధపడే వారికి నెలనెలా రూ.10 వేలు పింఛన్ ఇస్తాం.
- మహానేత కాలంలో జరిగినట్లే.. మూగ, చెవిటి పిల్లలు
- అందరికీ ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయిస్తాం.
- క్యాన్సర్ చికిత్సకు కనీసం ఏడెనిమిది సార్లు కీమోథెరపీ చేయాలి. ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం రెండుసార్లకు మాత్రమే
- డబ్బులిస్తోంది. దీంతో ఆరు నెలల తర్వాత వారికి క్యాన్సర్
- వ్యాధి తిరగబెడుతోంది. రోగులు చనిపోవాల్సిన దుస్థితి
- నెలకొంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సరిగా జరగడం లేదు. పేదలు ఆస్పత్రులకు వెళితే ఏడాది తర్వాత రమ్మంటున్నారు. దీంతో వారి ప్రాణాలు పోతున్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తాం.
- ఆపరేషన్ పూర్తయ్యాక వైద్యులు సూచించే విశ్రాంతి కాలంలో పనులు చేసుకోలేరు కాబట్టి ఆర్థిక సాయం అందిస్తాం.
- ఈ సాయం వారం.. నెల.. ఆరు నెలలు అయినా
- సరే ప్రభుత్వం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment