సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చర్మకారులది దిక్కులేని బతుకైంది. నాలుగున్నర ఏళ్ల నుంచి పింఛన్, చెప్పులు కుట్టే వస్తువులు, మెటీరియల్ కొనుగోలుకు సాయం అందిస్తామని ప్రభుత్వం చర్మకారులను ఊరిస్తూనే ఉంది. ఈ నెలలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో చర్మకారుల పరిస్థితి ఆశాజనకంగా ఉండేట్టు కనిపించడంలేదు. రాష్ట్రంలో చెప్పులు కుట్టేవారు సుమారు లక్షన్నర వరకు ఉన్నారని చర్మకారుల సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం మాత్రం 24,168 మందిని మాత్రమే గుర్తించి వీరికే సాయం అందిస్తామంటోంది. అది కూడా ఎప్పుడు ఇస్తారో చెప్పటం లేదు. ఎంతోమంది పట్టణాల్లో ఫుట్‌పాత్‌లపై ఇప్పుడు కూడా చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్నారు. గతంలో ఎక్కువమంది తెగిన చెప్పులు కుట్టించుకునేవారు. ఇప్పుడు తెగిపోయిన చెప్పులు చెత్తకుప్పలో పడేసి కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. మరో పదేళ్లలో చెప్పులు కుట్టేవారి సంఖ్య కనిపించకుండా పోతుందని వారు చెబుతున్నారు. తమ పిల్లలు మట్టి పనికైనా వెళతామంటున్నారు కానీ చెప్పులు కుట్టి బతకలేమని అంటున్నారని చర్మకారులు చెబుతున్నారు. విజయవాడ నగరంలో సుమారు 150 మంది ఫుట్‌పాత్‌లపై చెప్పులు కుట్టేవారు ఉన్నట్టు చర్మకారుల యూనియన్ నాయకులు తెలిపారు.
సాయం కోసం ఎదురుచూపు
చెప్పులు కుట్టే వారు ప్రభుత్వసాయం కోసం ఎదురుచూస్తున్నారు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లు పైబడిన వారికి పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 18 నుంచి 70 ఏళ్లు పైబడిన వారు మొత్తం 24,168 మంది ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఈ లెక్కలు తప్పని చెప్పులు కుట్టే అరుంధతీయులు చెబుతున్నారు. సుమారు లక్షన్నర మంది చెప్పులు కుట్టేవారు ఉన్నట్టు చర్మకార సంఘాల నాయకులు చెబుతున్నారు.
పింఛన్ ఎప్పుడిస్తారో?
చెప్పులు కుట్టుకునే ఎస్సీ వృత్తిదారుల్లో 40 ఏళ్లు నిండిన వారికి పింఛన్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారు మొత్తం 19,750 మంది ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది. వీరికి ఎప్పటి నుంచి పింఛన్ ఇస్తారో చెప్పటం లేదు. 40–50 ఏళ్ల మధ్యవారు 12,953 మంది, 51–55 మధ్య వారు 3,111 మంది, 56–60 మధ్య వారు 2,036 మంది, 61–65 మధ్య వారు 1,074 మంది, 66–70 మధ్య వారు 429 మంది, 70 ఏళ్లు పైబడిన వారు 147 మంది ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. పింఛన్‌కు అర్హులైన వారు రాష్ట్రంలో సుమారు లక్ష మంది వరకు ఉన్నారని చర్మకార సంఘాల వారు చెబుతున్నారు.
నాకు ఏమీ ఇవ్వలేదు
నాకు 47 ఏళ్లు. చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్నా. రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు వస్తాయి. ఒక్కోరోజు అవీ రావు. ముగ్గురు పిల్లలూ ఈ వృత్తిలోకి రామంటున్నారు. చదువుకుంటున్నారు. వారికి పెళ్లిళ్లు చేయాలి. ప్రభుత్వం ఏమి ఇస్తుందో మాకు తెలియదు. మాకు ఎవ్వరూ చెప్పేవారు లేరు. నేను అంతగా చదువుకోలేదు. మాదిగ దండోరా వారు వచ్చి పింఛన్‌లు ఇస్తారని చెప్పి ఫొటోలు తీసుకున్నారు. మళ్లీ వారు కనిపించలేదు. మాలాంటోళ్లం విజయవాడలో 150 మంది వరకు ఉన్నాం. ఫుట్‌పాత్‌లపై చెప్పులు కుట్టుకుని బతుకుతున్నాం. ఇన్నేళ్ల తర్వాత మా గురించి మీరు అడుగుతున్నారు. ఎందుకో భయంగా ఉంది. –తాళ్లూరి ప్రసాద్, చర్మకారుడు, విజయవాడ
మాకసలు తెలీదు
ప్రభుత్వం పింఛన్లు ఇస్తామన్న విషయం కానీ, చెప్పులు కుట్టుకునేందుకు వస్తువులు, ముడి సరుకు కొనుగోలు చేసేందుకు సాయం చేస్తారని కానీ ఇంతవరకు మాకు తెలీదు. ఈ ప్రభుత్వం ఎవరికి సాయం చేస్తుందయ్యా. మా బతుకులు ఇంతే.. మాకు సాయం చేసేవారు ఎవ్వరూ లేరు. వీధికి పదిమంది వరకు విజయవాడలో చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్నాం. ఇటీవల చెప్పులు కుట్టించుకునేవారు తగ్గారు. మా పిల్లలు ఈ వృత్తిలోకి రారు. ఇక చెప్పులు తెగిపోతే పారెయ్యాల్సిందే. కుట్టేవారు ఉండరు. –కువ్వారపు సామ్యుల్ (57), చర్మకారుడు, విజయవాడ
చర్మకారుల దిక్కులేని బతుకు!
Published Sun, Feb 3 2019 9:06 AM | Last Updated on Sun, Feb 3 2019 11:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment