
బజుల్లా రోడ్డులోని ఎన్టీఆర్ ఇల్లు
సాక్షి, ప్రతినిధి, చెన్నై: 28 బజుల్లా రోడ్.. టీ నగర్.. చెన్నై.. దూర ప్రాంతాల నుంచి అక్కడకు తరలివెళ్లే అభిమానులకు ఆ ఇల్లు మరో తిరుపతి! అన్నగారి పట్ల అంతులేని అనురాగానికి అది చిరునామా. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అన్న నందమూరి తారక రామారావు నివాసం ఇప్పుడు అంగడి సరుకుగా మారింది. ఎన్నో అనుబంధాలు, మధుర జ్ఞాపకాలకు గుర్తుగా నిలిచిన చెన్నైలోని ఎన్టీఆర్ నివాసం కొనుగోలు చేసేవారి కోసం దీనంగా ఎదురు చూస్తోంది. బ్రోకర్ ఏలుమలై పేరు, సెల్‌ఫోన్ నెంబర్‌తో ఆ ఇంటి గేటుకు వేలాడుతున్న బోర్డు తెలుగు ప్రజల హృదయాలను కలచివేస్తోంది. ఎన్టీఆర్‌కు ఆ ఇంటితో అనుబంధం గురించి ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఓ వ్యక్తి అందించిన వివరాలు ఇవీ...
బెడ్‌రూం పక్కనే పిల్లల గది...
ఎన్టీఆర్ నటుడిగా స్థిరపడిన తరువాత చెన్నై రంగరాజపురంలో ఓ చిన్న ఇంటిని కొనుగోలు చేశారు. ఆయన రాకతో ఆ వీధి ఎన్టీఆర్ స్ట్రీట్‌గా మారింది. అక్కడ ఉండగా ఒక కుక్కను పెంచుకుంటూ షూటింగ్ లేని సమయాల్లో దానితో గడిపేవారు. (బజుల్లా రోడ్డుకి మారిన తర్వాత ఆ కుక్కను, ఇంటిని తన సోదరుడు త్రివిక్రమరావుకు అప్పగించారు) అనంతరం ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తరువాత ఆనాటి ప్రముఖ హాస్య నటుడు కస్తూరి శివరావు నుంచి బజుల్లా రోడ్డులోని ఇంటిని 1953లో కొనుగోలు చేశారు. రెండంతస్థుల ఆ ఇంటికి కొద్దిగా మెరుగులు దిద్ది నివాసం, ఆఫీస్ అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. గేటు దాటి ప్రవేశించగానే రెండు ఏనుగుల బొమ్మలు అందంగా కనిపించేవి. మిద్దెపైన పిల్లల గదులు, ఆయన బెడ్‌రూం ఉండేది. కింద పోర్షన్‌లో ఆఫీస్, సందర్శకుల కోసం మరో గది, మేకప్ రూం ఉండేవి. కంటిచూపు సరిగా కనపడని ప్రసాద్ అనే వ్యక్తి ఆయనకు మేనేజర్‌గా వ్యవహరించేవారు. ఆయన్ను ‘కళ్లజోడు’ ప్రసాద్ అని పిలిచేవారు. ఎన్టీఆర్ కూర్చునే గదిలో తల్లిదండ్రుల ఫోటో, ఆరుగురు కూర్చునే సోఫా, ఆయన కోసం ఒక విలాసవంతమైన కుర్చీ ఉండేది.
6.00 గంటలకు చికెన్‌తో భోజనం ...
ఎన్టీఆర్ నిత్యం తెల్లవారుజామున 3.30 గంటలకు నిద్ర లేచేవారు. మేడపై నుంచి దిగుతూ గట్టిగా గొంతు సవరించుకునేవారు. అది వినపడగానే ఆయన కోసం వేచి ఉండే వారంతా అప్రమత్తమయ్యేవారు. తనను కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడిన అనంతరం ఉదయం 6.00 గంటలకు కొద్దిగా చికెన్‌తో కలిపి భోజనం చేసేవారు.
ఏ ఊరు మనది...?
ఎన్టీఆర్ 7.00 గంటలకు మేకప్‌తో బయటకు వచ్చి మెయిన్ గేటు తెరవాలని ఆదేశించటమే ఆలస్యం అప్పటికే అక్కడ గుమికూడిన అభిమానులు ఇంటి వరండాలోకి చేరుకునేవారు. రెండు చేతులూ జోడించి వారికి నమస్కరిస్తూ ‘ఏ ఊరు మనది..?’ అంటూ గంభీరంగా ప్రశ్నించేవారు. ‘షూటింగ్ చూస్తారా...?’ అని అభిమానులను ప్రశ్నించి అందుకు ఏర్పాట్లు కూడా చేసేవారు.
నేలపైనే ఆయన నిద్ర...
భక్తి ప్రపత్తులు ఎక్కువగా కలిగిన ఎన్టీఆర్‌కు చాలా సెంటిమెంట్లు ఉండేవి. ఆదివారం పూర్తిగా ధవళ వస్త్రాలు ధరించి నుదుటిన అడ్డంగా విభూది పెట్టుకునేవారు. ఎవరికైనా ఆర్థిక సాయం చేయదలిస్తే తన చేత్తో కాకుండా భార్య బసవతారకం లేదా ఇతరుల చేతుల మీదుగా అందించేవారు. వారు అందుబాటులో లేని పక్షంలో సమీపంలోని కుర్చీ లేదా గోడపై డబ్బును ఉంచి తీసుకోమనేవారు. రాత్రి 8.30 గంటలకు నిద్ర పోవడానికి ముందుగా చపాతి తిని పాలు తాగేవారు. ప్రతి రోజూ నేలపైనే ఒంటరిగా పడుకునేవారు.
దిగ్గజాలను మళ్లీ కలిపిన ప్రేమాభిషేకం..
ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల మధ్య వృత్తిపరమైన విభేదాలు తలెత్తిన సమయంలో ప్రేమాభిషేకం చిత్రం వారిని తిరిగి కలిపింది. ఈ సినిమా కచ్చితంగా ఏడాది ఆడుతుందని ఏఎన్నార్ గ్రేట్ అని ఎన్టీఆర్ ప్రశంసించారు. ఊటిలో షూటింగ్‌లో ఉన్న ఏఎన్నార్‌కు ఫోన్ చేసి సినిమా సూపర్‌హిట్ అని చెప్పారు. ప్రొడక్షన్ వాళ్లు యావరేజ్ అంటున్నారని అక్కినేని చెప్పగా.. లేదు సూపర్ హిట్ అవుతుందని చెప్పి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఈ సినిమాలో హీరోగా తాను కూడా చేయలేనని చెప్పి ఎన్టీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. ‘బ్రదర్.. మన ఇద్దరి మధ్యన ఎవరెవరో ఏదో పెడుతుంటారు. మనం సర్దుకుపోవాలి..’ అని ఏఎన్నార్‌కు స్నేహహస్తం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment