మూడు మృతదేహాలను ఒకే గొయ్యిలో సమాధి చేస్తున్న దృశ్యం,చికిత్స పొందుతున్న చిన్నారి శ్రావణి
చిన్నారి శ్రావణి... అంతపెద్ద కష్టాన్ని ఎలా భరించగలదో తలచుకుంటేనే అందరి గుండెలు బరువెక్కి పోతున్నాయి. విధి ఆడిన నాటకం శ్రావణి జీవితంలో అమావాస్య చీకట్లు నింపింది. తల్లిదండ్రులను, సోదరిని రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకున్న ఆ అభాగ్యురాలు ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో కేజీహెచ్‌లో ఉంది. ఆమె కోమాలో ఉండగానే తల్లిదండ్రులు, సోదరి మృతదేహాలకు బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో కడసారి చూపునకు కూడా ఆమె నోచుకోలేకపోయింది.
విశాఖపట్నం, యలమంచిలి: అమ్మానాన్న చెల్లి లేరన్న నిజం ఆ దురదృష్టవంతురాలికి ఇంకా తెలియదు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి కోమాలో ఉంది. కోమాలో నుంచి బయటపడితే గాని గుండెలు పిండేసే విషాదవార్త ఆమెకు తెలిసే అవకాశం లేదు. సోమవారం కొక్కిరాపల్లి హైవేపై రోడ్డుప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన సంగంతి తెలిసిందే. ప్రమాదంలో గాయాలతో బయటపడిన పెద్దకుమార్తె శ్రావణి కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలకు మంగళవారం పోలీసులు యలమంచిలిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. గంగరాజు అన్నదమ్ములు మృతదేహాలను నేరుగా శ్మశానానికి తరలించారు.
గంగరాజు,కుమారి, పుష్ప మృతదేహాలను ఖననం చేసి, అంత్యక్రియలు పూర్తిచేశారు. కుటుంబ సభ్యులతో పాటు గాంధీనగరం కాలనీవాసులు హాజరయ్యారు. కనీసం కుమార్తె శ్రావణి వచ్చి పిడికెడు మట్టివేసినా వారి ఆత్మకు శాంతిచేకూరేదని, ఆ ఆవకాశం కూడా లేకుండాపోయిందని అక్కడివారు కంటతడిపెట్టారు. శ్రావణి స్పృహలో ఉంటే కుటుంబసభ్యులను కడసారిగా చూసుకునేది. బంధువుల మొక్కులు ఫలించి శ్రావణి పూర్తిగా కోలుకొని బయటపడితే నెమ్మదిగా సంఘటన గురించి చెప్పాల్సి ఉంటుంది.
చిన్నారి పరిస్థితి విషమం
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ) : యలమంచిలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి డి.శ్రావణి (13) పరిస్థితి విషమంగా ఉందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున తెలిపారు. పాప ఆరోగ్య పరిస్థితిని మంగళవారం సమీక్షించి ట్రామాకేర్ వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కనుబొమల మధ్య ఎముక, కుడి తొడ ఎముక విరగడంతో పాటు మెదడులో రక్తం గడ్డగట్టిందని తెలిపారు. చికిత్సపై సంబంధిత న్యూరో సర్జన్స్, ఆర్థోపెడిక్ వైద్యులతో పాటు నర్సింగ్ స్టాఫ్‌కు ఆదేశాలు జారీచేశారు. న్యూరో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ సత్యవరప్రసాద్, ఆర్థోపెడిక్ శాఖ హెడ్ డాక్టర్ వి.ధర్మారావు, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి, ఆర్‌ఎంవో డాక్టర్ బంగారయ్య, ఏఆర్‌ఎంవో డాక్టర్ సాధన ఆయన వెంట ఉన్నారు.
బీమా సొమ్మపై సందిగ్ధం
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గంగరాజు, కుమారి,పుష్పలు చంద్రన్నభీమాలో సభ్యులు. బీమాలో తక్షణ సాయంగా రూ.15వేల మంజూరయ్యాయి. భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు ఇద్దరు చనిపోతే పిల్లలకు అందజేస్తారు. కుటుంబంలో ముగ్గురు చనిపోగా మిగిలిన ఒక్క కుమార్తె శ్రావణి కోమాలో ఉంది. దీంతో బీమా సొమ్ము ఎవరికి ఇవ్వాలో చిక్కుముడిగా తయారయ్యింది. శ్రావణి కోమానుంచి బయటపడితే బీమాసొమ్మును అందజేయనున్నారు.+
పాపం.. పసిపాప!
Comments
Please login to add a commentAdd a comment