సీఎంగా కిరణ్ ఉన్నంతకాలం మంత్రి పదవి తీసుకోను
దమ్ముంటే నా రాజీనామా ఆమోదించాలి: శ్రీధర్‌బాబు
సాక్షి, కరీంనగర్: కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మంత్రి పదవి తీసుకోనని శ్రీధర్‌బాబు ప్రతినబూనారు. కుట్రపూరితంగా తనను శాసనసభా వ్యవహారాల నుంచి తప్పించారని ఆరోపించారు. కిరణ్‌కు దమ్ముంటే తన రాజీనామాను ఆమోదించాలని అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత మొదటిసారి ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లాకు రాగా కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి, భారీర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసమే తాను అనేక అవమానాలు భరించానని చెప్పారు. అమరవీరుల త్యాగాల ముందు తన రాజీనామా ఎక్కువ కాదన్నారు. ముసాయిదా బిల్లుపై రాజ్యాంగబద్దంగా ఓటింగ్ సాధ్యం కాదని, ఆర్టికల్ 3,4 ప్రకారం సూచనలు, అభిప్రాయాలు చెప్పే అవకాశం మాత్రమే ఉంటుందని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. 43రోజుల గడువు ఇస్తూ బిల్లు పంపినా సీమాంధ్ర నేతలు మరింత గడువు కోరనున్నారని తెలిసిందని, వారెన్ని ఎత్తులు వేసినా అది సాధ్యం కాదన్నారు. బిల్లును ఆపుతామని సీమాంధ్ర నేతలు అక్కడి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. విభజన ప్రక్రియలో జాప్యం చేసేందుకు కిరణ్ కుట్రలు పన్నుతున్నారని మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఆయన ఆరోపించారు.