'కిరణ్ మంత్రుల విశ్వాసాన్ని కోల్పోయారు'
హైదరాబాద్ : తెలంగాణ బిల్లును వెనక్కి పంపాలనటం రాజ్యాంగ విరుద్దమని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. తెలంగాణ మంత్రులను సంప్రదించకుండా కిరణ్ ఇచ్చిన తీర్మాన నోటీసు ప్రభుత్వ తీర్మానంగా పరిగణించరాదని వారు అన్నారు. సీఎం ఏకపక్షంగా ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని స్పీకర్ను కోరినట్లు గండ్ర, శ్రీధర్ బాబు తెలిపారు. సభలో బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు తీర్మానం ఇవ్వటం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలను కించపరుస్తున్న సీఎంపై తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రలు విశ్వాసం కోల్పోయామని అన్నారు. ఇప్పటికైనా సీఎం నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం కిరణ్, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు ఒకేతీరుగా వ్యవహరించడంపై.. గండ్ర మండిపడ్డారు. ప్రభుత్వ తిరస్కార తీర్మానాన్ని అనుమతించారదని ఇప్పటికే లేఖలిచ్చిన టీ మంత్రులు.. ప్రభుత్వంలో తాము భాగస్వామ్యులైనప్పటికీ తమని ఏమాత్రం సంప్రదించకుండా సీఎం ఏకపక్షంగా తీర్మానాన్ని ఇచ్చారని.. కాబట్టి ఈ తీర్మానం నోటీసును తిరస్కరించాలని డిమాండ్ చేశారు. దీన్ని ప్రభుత్వ తీర్మానంగా పరిగణించరాదని అన్నారు.