శ్రీధర్‌బాబు శాఖ మార్పు తప్పే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగపరమైన ప్రక్రియ కొనసాగుతోందని.. ఇప్పుడు ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా దానిని ఆపలేరని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఫిబ్రవరి మొదటివారంలో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసై తీరుతుందన్నారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత కీలక తరుణంలో డి.శ్రీధర్‌బాబును శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి తప్పించడం తప్పేనని, ఇది చాలా బాధ్యతారహితమైన చర్య అన్నారు. ఢిల్లీలో బుధవారం సాయంత్రం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జైపాల్... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పేరును ఎక్కడా ప్రస్తావించకుండానే ఆయన వైఖరిని గట్టిగా తప్పుపట్టారు. శాఖల మార్పునకు సంబంధించి సీఎంకున్న అధికారాలను తాను ప్రశ్నించబోనని, అయితే, శాఖలను మార్చడం వల్ల ఈ ప్రక్రియ ఆగుతుందని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ‘అయితే ప్రస్తుత కీలక సందర్భంలో అలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఏ సంకేతాలు వెళ్తాయి? ఏ సందేశాలు వెళ్తాయి?’ అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రిపై ఆయన పరోక్షంగా పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరికి నిజమైన ఆత్మవిశ్వాసం ఉంటుందో వాళ్లు అంత తొందరపడరు. ఎవరికి ఆత్మవిశ్వాసం లేదో వాళ్లే అల్లరి పెడుతుంటారు. ఇవన్నీ ఉత్తరకుమార ప్రగల్భాలు తప్ప మరేం కాదు’ అని విమర్శించారు. ఎవరు ఏ అధికారంలో ఉన్నా విజ్ఞత మేరకే వ్యవహరించాలని, ఆ విజ్ఞత పరిమితమైనదైతే ఎవరేం చేయగలరని విమర్శించారు. ‘కాలచక్రం అనేది నిర్ణయాత్మకం. నీ కోసం, నా కోసం వేచిచూడదు. జనవరి 23 రాత్రి 12 గంటలు కొట్టిందంటే ఇక అసెంబ్లీ చేతిలో, ఎవరి చేతిలో బిల్లు ఉండదు. పార్లమెంట్ చేతిలోకి వస్తుంది’ అన్నారు. సీఎం ధిక్కారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు భరిస్తోందన్న ప్రశ్నకు.. ‘కాంగ్రెస్ హైకమాండ్‌కు భూమాతకు ఉన్నంత ఓపిక ఉంది’ అని బదులిచ్చారు. ప్రజలు మరో ఉద్యమానికి దిగకుండా చూసేందుకే శాఖ మార్పుపై ఇంతగా స్పందిస్తున్నానన్నారు. ‘ఇదేదో బ్రహ్మాస్త్రం, దీనివల్ల ఏదో ఆగుతుందనే భ్రమతో మేం మాట్లాడటం లేదు’ అన్నారు.
చరిత్రాత్మక అవకాశాన్ని కోల్పోవద్దు...
బిల్లుపై చర్చకు లభించిన చరిత్రాత్మక అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని జైపాల్ శాసనసభ్యులకు విజ్ఞప్తిచేశారు. ‘తెలంగాణ ఏర్పాటు తథ్యం. ప్రక్రియ పూర్తి కావడం ఖాయం. వచ్చిన గొప్ప అవకాశాన్ని నిర్మాణాత్మకంగా అసెంబ్లీ ఉపయోగించుకోవాలి’ అని కోరారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు వ్యూహాత్మకంగానే నిగ్రహాన్ని పాటిస్తున్నారని, 23వ తేదీ వరకు వారలా ఉండటం చాలా అవసరమన్నారు. విడిపోతున్న సందర్భంలో మనస్పర్థలు పెంచడం మంచిది కాదని సీమాంధ్ర నేతలకు జైపాల్ మనవి చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కొంత ఆలస్యమవుతున్న మాట నిజమేనని, అయితే, ఇంతకన్నా త్వరగా మరే ఇతర రాష్ట్రం ఏర్పాటుకాని విషయాన్ని అంతా గమనించాలని ఆయన కోరారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచారం చూసి సీమాంధ్ర ప్రజలు మోసపోరాదని, తెలంగాణ ప్రజలు ఆ పార్టీల ప్రచారంతో ఆందోళన చెందరాదని సూచించారు. పార్లమెంట్‌లో బీజేపీ సహా అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు ఇస్తాయని తాను పూర్తిగా నమ్ముతున్నానన్నారు. టీఆర్‌ఎస్ విలీనం, ఇతరత్రావాటితో ఈ ప్రక్రియకు సంబంధం లేదని జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.