బంతిని చూసి బ్యాటింగ్ చేయాలి: కిరణ్
హైదరాబాద్ : మంత్రుల శాఖల మార్పుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. శాఖ మార్పుపై తానెవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తనపై వస్తున్న విమర్శలకు స్పందించనని కిరణ్ బుధవారమిక్కడ తెలిపారు. సీఎంగా తనకు శాఖలను మార్పు చేసే అధికారం ఉందని ఆయన మీడియా చిట్చాట్లో అన్నారు. 'బంతిని చూసి బ్యాటింగ్ చేయాలని.... ముందుగానే బ్యాట్ ఊపితే అవుట్ అవుతాము' అని కిరణ్ వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగేందుకే శాఖల్లో మార్పులు చేశామని కిరణ్ తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం, విడిపోవటం వల్ల వచ్చే లాభ నష్టాలపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. వాణిజ్య పన్నుల శాఖ నుంచి ఆదాయం తగ్గిందని.....శ్రీధర్ బాబు సమర్థంగా పని చేస్తారనే ఆయన్ని ఆ శాఖకు బదిలీ చేసినట్లు తెలిపారు. ఆదాయం పెంచాలనే శ్రీధర్ బాబుకు ఆశాఖ అప్పగించినట్లు చెప్పారు.
తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో అన్నిప్రాంతాల సభ్యులు తమ అభిప్రాయం చెప్పాలని కిరణ్ అన్నారు. ముందుగా రాష్ట్రపతి ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవాలని ...ఆతర్వాతే అదనపు సమయం గురించి ఆలోచించాలన్నారు. తెలంగాణ బిల్లుపై నిబంధనలు, సంప్రదాయబద్దంగా చర్చ జరగాలన్నారు. కాగా తన భవిష్యత్ ప్రణాళికపై ఇంకా ఆలోచించలేదని కిరణ్ అన్నారు.