
విహారయాత్రలో విషాదం
విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. అరకు అందాలను వీక్షించేందుకు వచ్చిన కళాశాల
డుంబ్రిగుడ/రాజాం రూరల్: విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. అరకు అందాలను వీక్షించేందుకు వచ్చిన కళాశాల విద్యార్థుల్లో ఒకరు గెడ్డలో స్నానానికి దిగి గల్లంతై విగతజీవిగా మారాడు. పోలీసులు, మృతుని స్నేహితులు అందించిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రాజాం జీఎంఆర్ ఐటీ కళాశాలకు చెందిన తొమ్మిది మంది బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు శనివారం విహార యాత్రలో భాగంగా మండలంలోని చాపరాయి జలపాతాన్ని తిలకించేందుకు వచ్చారు. సరదాగా జలపాతంలో జారుతూ స్నానాలు చేశారు. ఇందులో జె.సాకేత్ అనే విద్యార్థి గెడ్డలో దిగి గల్లంతయ్యాడు. ఆందోళన చెందిన స్నేహితులు స్థానికులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు తెలిపారు. ఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బంది గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. విద్యార్థి హైదారాబాద్‌కు చెందిన వాడు కాగా, తండ్రి ఓ బ్యాంక్ ఉద్యోగి అని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన తెలిసి కళాశాల యాజమాన్యం, విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పీడీఓ అరుణ్‌కుమార్, ఏఓ ఆకిరి రామారావు తదితరులు వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు.