
గొడ్డు చాకిరీకి బహుమానం తొలగింపా..?
* ఉద్యోగ సంఘాలు ఏకమవ్వాలి
* దాన్యం కొనుగోలు ఇష్టం లేదా, డబ్బులు లేవా
* వైఎస్‌ఆర్‌సీపీ శ్రీకాకుళం ఇన్‌చార్జి బేబీనాయన
బొబ్బిలి: రాష్ర్ట ప్రభుత్వం మహిళలు, రైతులు ఉసురు పోసుకుంటోందని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఎంత మాత్రం మంచిది కాదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జి ఆర్వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) అన్నారు... బొబ్బిలి కోటలోని దర్బార్ మహల్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
అంగన్వాడీల చేత గొడ్డు చాకిరీ చేయించుకుని వారు పడుతున్న కష్టానికి ఫలితం ఇవ్వలేదు సరికదా ఇప్పుడు వారిని విధుల నుంచి తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం నీచమైన చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని, వీడియో పుటేజ్‌ల ద్వారా గుర్తించి వారిని విధుల్లోంచి తొలగించడానికి ఉత్తర్వులు ఇవ్వడం దారుణమన్నారు. అంగన్వాడీలకు మద్దతుగా ఉద్యోగ సంఘాలు నిలవాలని కోరారు.
ఆడవారిని కండతడి పెట్టించారని, వారి ఉసురుతో రాజకీయ పతనం తధ్యమని జోస్యం చెప్పారు.
కొనుగోలు ఇష్టం లేదా..? డబ్బులు లేవా..?
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి నిబంధనలు పెట్టి ప్రభుత్వం చిత్రహింసలకు గురి చేస్తోందని, అసలు ధాన్యం కొనుగోలు చేయడానికి ఇష్టం లేదా? లేక చెల్లించేందుకు డబ్బులు లేవా? అని బేబీనాయన ప్రశ్నించారు.. ఇన్ని నిబంధనలు మునుపెన్నడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
పండించిన పంటను తీసుకోకపోవడంతో రైతు కన్నీరు పెడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కౌలురైతులకు కార్డులుండాలని, ఎకరాకు 25 క్వింటాళ్లే తీసుకురావాలనే నిబందన పెట్టి వారికి ఇబ్బందులకు గురి చేస్తుండడం అన్నాయమన్నారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న కష్టాలు, ఇబ్బందుల గురించి పరిశీలన చేయాలన్నారు. నిబంధనలను సడలించి రైతులు స్వేచ్ఛగా అమ్ముకునే విధంగా ఉత్తర్వులను వెంటనే ఇవ్వాలని బేబీనాయన డిమాండ్ చేశారు.