
శ్రీనగర్ వరదల్లో చోడవరం విద్యార్థి
- కొడుకు ఎలా ఉన్నాడోనని కుటుంబసభ్యుల ఆందోళన
- సైనిక శిబిరంలో రోహిత్ సురక్షితం
చోడవరం : ఉన్నత చదువుల కోసం శ్రీనగర్ వెళ్లిన కొడుకు వరదల్లో చిక్కుకోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. నాలుగు రోజులుగా కాశ్మీర్‌లో వరదలకు ఊళ్లకు ఊళ్లే మునిగిపోయిన విషయం తెలిసిందే. శ్రీనగర్ ఎన్‌ఐటి(నిట్) కూడా మునిగిపోయింది. అందులో చదువుతున్న చోడవరానికి చెందిన భమిడిపాటి రోహిత్ కూడా చిక్కుకు పోయాడు. ఇక్కడి ప్రముఖ న్యాయవాది భమిడిపాటి జగన్నాథరావు(బాబీ) ఏకైక కుమారుడైన వెంకటరమణ రోహిత్ బీటెక్ చదువుకు కోసం శ్రీనగర్ నిట్‌లో చేరాడు.
ప్రస్తుతం సెకండియర్‌కు వచ్చాడు. ఇతనితో కలిపి మొత్తం 36 మంది విద్యార్థులు వరదల్లో చిక్కుకుపోయారు. విషయం తెలిసి కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే విద్యార్థులంతా ఆర్మీసాయంతో లేహ్ కొండప్రాంతంలో సురక్షితంగా ఉన్నట్టు కుటుంబసభ్యులకు సమాచారం అందింది.
కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ తన కుమారుడ్ని సురక్షితంగా ఇంటికి చేర్చాలంటూ రోహిత్ తండ్రి బాబీ రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడ్ని కోరారు. ఈమేరకు ఆయన సీఎంతోను ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతోను ఫోన్‌లో మాట్లాడారు. ప్రత్యేక విమానంలో ఆంధ్ర విద్యార్థులను తీసుకురావాలని కోరారు.