ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభపై ఊరేగింపు
వేయిదీపాల వెలుగులో ఊయల సేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణకాంతులీనే భాస్కరుడ్ని సప్త అశ్వాల రథసారథిగా మలచుకుని శంఖు, చక్ర, విల్లు, కత్తి, గద వంటి పంచాయుధాలు ధరించిన మలయప్ప ఉదయం తిరుమాడ వీధుల్లో విహరించారు. చంద్రుడ్ని వాహనంగా మలచుకున్న శ్రీనివాసుడు రాత్రివేళలో మాడ వీధుల్లో విహరించారు. సాయంత్రం శ్రీవారి ఆలయం ముందు కొలువు మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పకు ఊయల సేవ నిర్వహించారు. వేయి నేతి దీపాల వెలుగులో స్వామి దర్శనమిచ్చారు.
- సాక్షి, తిరుమల
గజ వాహనంపై గరళకంఠుడు
శ్రీశైల మహాక్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీభ్రమరాంబాదేవి శుక్రవారం కాళరాత్రిరూపంలో దర్శనమివ్వగా, శ్రీశైలమల్లన్న దేవేరి భ్రామరితో కలిసి గజ వాహనంపై విశేష పూజలందుకున్నారు. భక్తులు కర్పూర నీరాజనాలను అర్పించుకున్నారు.
- సాక్షి, శ్రీశైలం
శ్రీమహాలక్ష్మిగా కనకదుర్గమ్మ
దసరా ఉత్సవాల్లో ఏడోరోజు శుక్రవారం బెజవాడ ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మిగా దర్శనమిచ్చింది. ప్రసన్నవదనంతో వరదాభయ హస్తాలు, వివిధ రత్నాభరణాలతో ప్రకాశిస్తూ చేతిలో పద్మం ధరించిన మహాలక్ష్మిని భక్తులు దర్శించుకున్నారు.
-సాక్షి, విజయవాడ