
ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు
సాక్షి, విజయనగం(శృంగవరపుకోట) : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ చట్ట సభ్యులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాసనసభ సబార్డినేట్ చట్ట సభ్యులుగా మొత్తం 11 మంది శాసనసభ్యులతో ఈ కమిటీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఏకైక శాసనసభ సభ్యునిగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కమిటీలో చోటు దక్కడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవికి ఎంపిక చేసిన సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాంలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరింత చురుకుగా పనిచేసి ఎంపిక చేసిన పదవికి న్యాయం చేస్తానని, శృంగవరపుకోట నియోజకవర్గ అభివృద్ధికి అలుపెరుగని కృషి చేస్తానని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.