
స్టాఫ్‌నర్సు ఆత్మహత్య
పలాస: ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా గారబంద గ్రామానికి చెందిన అల్లు రజని(38) గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కాశీబుగ్గ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కె.కృష్ణారావు కథనం ప్రకారం... కాశీబుగ్గ రాజకుమార్ ఆస్పత్రిలో కొంతకాలంగా రజని నర్సుగా పనిచేస్తూ ఆస్పత్రిలోనే తోటి నర్సులతో ఒక గదిలో ఉంటున్నారు. ఆమెకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. భర్త బాలరాజు చనిపోయాడు. ఒక కుమారుడున్నాడు. భర్త చనిపోయిన తర్వాత హరిపురం నుంచి తన కన్నవారి గ్రామం గారబంద వెళ్లిపోయారు. తన తల్లి సునంద వద్ద కుమారుడిని ఉంచి, రెండున్నరేళ్లుగా కాశీబుగ్గలోని రాజకుమార్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు.
బుధవారం గారబంద వెళ్లి తన కుమారునికి కావాల్సిన కొన్ని వస్తువులు కొని ఇచ్చి తిరిగి ఆస్పత్రికి చేరుకున్నారు. రాత్రి ఎవ రూ లేని సమయంలో తన గదిలో పురుగు మందు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న తోటి నర్సులు ఆమెకు వైద్యసేవలందించారు. పరిస్థితి విషమించడంతో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా గురువారం ఉదయం 4 గంటలకు మృతి చెందారు. ఆమె చెల్లెలు గుమ్మళ్ల స్వాతి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కృష్ణారావు చెప్పారు. మృతికి కారణాలు తెలియడం లేదు.