
రోదిస్తున్న తల్లి , మార్చురీలో మృతదేహం
నెల్లూరు(క్రైమ్): ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఓ స్టాఫ్‌నర్సు విషపూరిత ఇంజక్షన్ వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున నగరంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్‌లోని ఓ ఇంట్లో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు..గుంటూరు జిల్లా నర్సారావుపేట మండలం కేసనపల్లికి చెందిన పి.యేసురత్నం, మార్తమ్మ దంపతులకు మమత (26), కోటేశ్వరరావు పిల్లలు. యేసురత్నం భార్యాబిడ్డలను వదిలేసి మరో మహిళతో ఉంటున్నాడు. దీంతో మార్తమ్మ అన్నీ తానై పిల్లలిద్దరిని పెంచి పెద్ద చేసింది. మమతను నర్సింగ్ చది వించింది. సుమారు 11 నెలలుగా మమత కాంట్రాక్ట్ పద్ధతిపై జీజీహెచ్‌లో స్టాఫ్‌నర్సుగా విధులు నిర్వహిస్తోంది. తొలుత ఆస్పత్రిలోని వసతి గృహంలో ఉండేది. మూడు నెలలుగా తన స్నేహితురాలైన జి. దుర్గాభవాని (స్టాఫ్‌నర్సు), పద్మశ్రీ (బ్యాంకు ఉద్యోగిణి)తో కలిసి కరెంట్ ఆఫీస్ సెంటర్ సమీపంలోని బ్యాంక్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కలిసి ఉంటున్నారు. ఆస్పత్రిలో తన విధులు ముగించుకొని సోమవారం రాత్రి గదికి వచ్చింది. స్నేహితులతో కలిసి భోజనం చేసిం ది. అనంతరం ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండగా దుర్గాభవాని, పద్మశ్రీ నిద్రపోయారు.
ఈ క్రమంలో మమత విషపూరిత ఇంజక్షన్‌ను తన ఎడమచేతి నరానికి వేసుకొని తన మంచంపైనే కుప్ప కూలిపోయింది. మంగళవారం తెల్లవారు జా మున 4 గంటల సమయంలో పద్మశ్రీకి మెలకువ రావడంతో గదిలో లైట్లు వెలుగుతుండటాన్ని గమనించింది. లైట్లు ఆర్పేందుకు వెళుతుండగా ఆమె కాలికి సిరంజ్ తగిలింది. సిరంజ్‌ను పరిశీలించి దుర్గాభవానిని నిద్రనుంచి లేపింది. మమతను పరిశీలించగా అప్పటికే ఆమె ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో పైఇంట్లో ఉంటున్న వారిని సహకారంతో 108 ద్వారా జీజీహెచ్‌కు తరలించారు. జీజీహెచ్ వైద్యులు మమతను పరిశీలించి మృతి చెందిందని నిర్ధారించారు. దీంతో దుర్గాభవాని మృతురాలి తల్లికి ఫోన్ చేసి మమత అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించామని చెప్పింది. అనంతరం మమత ఆత్మహత్యపై ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుక్ను ఎస్సై సీహెచ్ కొండయ్య ఘటనా స్థలానికి చేరుకుని మమత ఆత్మహత్యకు ఉపయోగించిన సిరంజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మమత తల్లి, సోదరుడు నెల్లూరుకు చేరుకొని గుండెలవిసేలా రోదించారు. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ వ్యవహారమే కారణం?
మమత మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు విచారణలో వెల్లడైంది. మమత నర్సారావుపేటకు చెందిన తేజ అనే వ్యక్తిని ప్రేమించిందని సమాచారం. ఈ నేపథ్యంలో నెలరోజుల కిందట మమత తల్లి ఆమెకు మరొకరితో పెళ్లి చూపులను ఏర్పాటు చేసి కుమార్తెను రమ్మని ఫోను చేసి చెప్పింది. దీంతో ఇంటికి వెళ్లిన మమత తను కు పెళ్లి ఇష్టం లేదని చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇలా చేస్తుందని అనుకోలేదు
మమతను కష్టపడి చదవించి ప్రయోజకురాలిని చేశానని.. ఇలా చేస్తుందని అనుకోలేదని తల్లి మార్తమ్మ కన్నీరుమున్నీరైంది. నర్సారావుపేటలోనే నర్సుగా పనిచే సేది. నెల్లూరు జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగం(స్టాఫ్‌నర్సు) వచ్చిందని చెప్పడంతో 11 నెలల కిందట నెల్లూరుకు పంపాను. అప్పటి నుంచి రోజు తనతో ఫోనులో మాట్లాడుతుండేది. ఈస్టర్ తర్వాత వివాహం చేయాలని నిశ్చయించుకున్నాను. రెండు రోజుల కిందట ఫోన్ చేసి ఇంటికి వస్తానని చెప్పిం దంటూ బోరున విలపించింది.
Comments
Please login to add a commentAdd a comment