సాక్షి, ఒంగోలు: ప్రభుత్వం నుంచి ఇంకా పలు విధానపరమైన అంశాల్లో స్పష్టత లేకపోవడం.. బదిలీల హడావుడి.. జిల్లా స్థాయి అధికారుల్లో చాలా మందికి స్థానచలనం కలిగే అవకాశం ఉండటం.. వెరసి ప్రస్తుతం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఒక విధమైన స్తబ్దత కొనసాగుతోంది. అనేకమంది అధికారులు.. బదిలీలపై ప్రభుత్వ జీవో ఎప్పుడు వెలువడుతుందా..? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
బదిలీలు తప్పించుకోవాలనుకునే వారు ..నచ్చిన ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఆశీస్సుల కోసం తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం పలు శాఖల్లో సాధారణ కార్యకలాపాలు మినహా, ముఖ్యమైన ఫైళ్లు కదలడం లేదు. కొన్ని పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోయింది. గత ప్రభుత్వహయాంలో ప్రవేశపెట్టిన పలు పథకాలకు పేర్లుమార్చి, విధి విధానాల్లో కొన్ని మార్పులు చేసి కొత్తరూపంలో అమలుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆ ప్రక్రియపై ప్రభుత్వ కసరత్తు కొలిక్కి రాకపోవడంతో పలుశాఖల్లో సిబ్బందికి పనిలేకుండా పోయింది. ఐఏఎస్ కేడర్‌పై స్పష్టత రావడంతో ..ఇక, జిల్లాస్థాయి అధికారుల బదిలీలు కొలిక్కివస్తే జిల్లా పరిపాలన గాడినపడే అవకాశం ఉంది.
అధికార పార్టీ నేతల్ని ఆశ్రయిస్తూ..
జిల్లా స్థాయి అధికారుల్లో చాలామందికి మూడేళ్ల సర్వీసు పూర్తయింది. వీరిలో కొందరిని గతంలో కాంగ్రెస్ నేతలు ఏరికోరి తెచ్చుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక సహజంగానే వీరిని బదిలీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా ఈవిషయంపై ఒక స్పష్టతతో ఉన్నారని సమాచారం. జిల్లా స్థాయి అధికారుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం ఇటీవలే తొలగించింది.
కానీ, జీవో మాత్రం వెలువడాల్సి ఉంది. దాని కోసం అధికారులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బదిలీ ఖాయమనుకున్న వారు అనుకూలమైన జిల్లాను ఎంచుకుని, అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేపట్టారు. కొందరు ఇదే జిల్లాలో వేరే పోస్టులకు మారేందుకు చూస్తున్నారు.
కలెక్టర్ విజయకుమార్‌కు బదిలీ అనివార్యమైనప్పటికీ, జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల్లో కొందరు ఆయన్ను ఇక్కడ్నే కొనసాగించాలని పట్టుబడుతున్నారు. జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్, స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు, బీసీ సంక్షేమాధికారి మయూరి నాన్‌లోకల్ (తెలంగాణ) కింద బదిలీ అవడం తప్పనిసరవుతోంది.
ఇంకా బదిలీ ఖాయమని భావిస్తున్న వారిలో హౌసింగ్ పీడీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డీఆర్‌వో, డీపీవో, డీఆర్‌డీఏ పీడీ, డీఎంహెచ్‌వో, డీఈవో, డ్వామాపీడీ, ఐసీడీఎస్ పీడీ, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి తదితరులు ఉన్నారు.
ఒంగోలు, కందుకూరు ఆర్డీవోలకు కూడా స్థానచలనం తప్పదని ప్రచారం జరుగుతోంది. పలువురు ఎంపీడీవోలు, తహశీల్దార్‌లకు బదిలీలు జరగవచ్చు. ఇక, జిల్లాలో కొన్ని కీలకమైన పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అవి ప్రస్తుతం ఇన్‌చార్జుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ, విద్యాశాఖతో పాటు పలు శాఖల్లో స్పష్టమైన పోస్టుల భర్తీపై ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా దృష్టిపెట్టి ఎవరికి వారు ప్రయత్నాల్ని ముమ్మరం చేసుకుంటున్నారు.
అన్ని శాఖల్లోనూ అదే పరిస్థితి..
కొన్ని అభివృద్ధి పథకాల విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తిస్పష్టత రాలేదు. బంగారుతల్లి, రాజీవ్ యువశక్తి వంటి పథకాల పేర్లను మార్చి కొత్త విధి విధానాలను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రెండు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరగడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్‌ల ద్వారా రుణాల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక ముందుకు కదలడం లేదు.
గ్రామీణ ఉపాధిహామీ పథకం కొనసాగుతున్నా.. దీన్ని వ్యవసాయశాఖకు అనుబంధం చేయాలనే ప్రభుత్వ ఆలోచన ఆచరణలోకి రాలేదు. కొత్త నిబంధనలు వచ్చే దాకా గృహనిర్మాణ శాఖ సర్వర్‌ను నిలిపేశారు. ప్రస్తుతం కొత్త దరఖాస్తుల శాంక్షన్‌తో పాటు పాతవాటికి బిల్లులు ఇవ్వడం కూడా ఆపారు. గ్రామీణ నీటి పారుదల, గృహనిర్మాణ, ఆర్‌అండ్‌బీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఆన్‌లైన్ బిల్లులను కూడా ఇవ్వడం లేదని తెలిసింది. ఈనెల 20, 22వ తేదీల్లో జరిగే సాధారణ, వ్యవసాయ బడ్జెట్ సమావేశాల అనంతరం అభివృద్ధి, సంక్షేమ పథకాలపై స్పష్టత రావచ్చని, అప్పుడు అన్ని కార్యక్రమాలు ఊపందుకుంటాయని అధికారులు భావిస్తున్నారు.
పాలనలో స్తబ్దత..!
Published Tue, Aug 19 2014 1:07 AM | Last Updated on Thu, Sep 27 2018 3:19 PM
Advertisement
Advertisement