రాజధానికి స్టార్ స్టేటస్
విజయవాడ : రాష్ట్రాన్ని పర్యాటకరంగ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు సోమవారం పర్యాటక రంగ మిషన్‌ను ప్రకటించారు. అదే సమయంలో ఆయన జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కొన్ని కంపెనీలతో ఒప్పందాలను, మరికొన్ని కంపెనీలతో రిజిస్ట్రేషన్స్ కుదుర్చుకున్నారు. ఈ నేపధ్యంలో కొంతమంది పర్యాటక రంగ పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. స్టార్స్‌హోటళ్లు, రిసార్ట్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. ఐదు నక్షత్రాల హోటళ్లురాజధాని ప్రాంతంలోనూ, విజయవాడ నగరంలోనూ కంపెనీలు పెట్టేందుకు నగరంతో పాటు రాజధాని ప్రాంతంలోనూ ఐదు నక్షత్రాల హోటళ్లను నిర్మించేందుకు పెట్టుబడిదారులు ముందుకు వచ్చారు.
సీవ్యాలీ రిసార్ట్స్‌కు చెందిన ప్రభుకిషోర్ రూ.150 కోట్లతో నగరంలో 5 స్టార్ హోటల్‌ను నిర్మించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజ్ గ్రూప్ అండ్ జీవీ ఎస్టేట్ అండ్ హోటల్స్ ప్రైవేటు లిమిటెడ్ తరఫున మలినేని రాజయ్య రూ.200 కోట్లతో అమరావతిలో హోటళ్లు నిర్మించనున్నారు. ఐటీసీ గ్రూపు రూ.290 కోట్లతో విశాఖపట్నం, గుంటూరు నగరాలలో 5 స్టార్ హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్‌ఎల్‌ఇన్‌ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్ రూ.1000 కోట్లతో రాజధాని ప్రాంతంలో పాటు వివిధ జిల్లాలో రిసార్ట్స్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది.
కృష్ణాతీరంపై దృష్టి పెట్టండి : చంద్రబాబు
పర్యాటకరంగంలో పెట్టుబడి పెట్టేందుకు రాజధాని ప్రాంతంలో ఏఏ అవకాశాలున్నాయో పెట్టుబడుదారులకు సీఎం చంద్రబాబునాయుడే స్వయంగా వివరించారు. వివిధ జిల్లాల్లో అందమైన ప్రదేశాల గురించి అవగాహన కల్పించారు.రాజధాని ప్రాంతాన్ని, విజయవాడ గుంటూరు నగరాలను అందంగా తీర్చిదిద్దుతామని, పెట్టుబడిదారులు, స్థానికులు కూడా ఈప్రాంతం పై దృష్టి పెట్టి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. విజయవాడ నదీతీరంలో ఉందని ఈ ప్రాంతం పై పర్యాటక రంగ పెట్టుబడిదారులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. 30 కిలో మీటర్ల మేర నదిలో ఎప్పుడూ నీరు ఉండి ఆహ్లాదకర వాతావరణం ఉంటుందన్నారు. నగరానికి మధ్యలో మూడుకాల్వలు వెళ్లుతున్నాయని, వీటిని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ఇక్కడ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో రాజధాని ప్రాంతాన్ని బ్లూ, గ్రీన్ సిటీగా మార్చుతామని విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ శానిటేషన్, గ్రీనరీ, టూరిజంపై దృష్టి పెడతామని చెప్పారు. పర్యాటకరంగంలో పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు.